Virat Kohli & Jos Buttler: బెంగుళూరు పుంజుకునేనా ?

ఐపీఎల్‌ 2022 సీజన్‌ లో ఈ రోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది.

  • Written By:
  • Publish Date - April 26, 2022 / 11:58 AM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌ లో ఈ రోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్.. ఈ ఐపీఎల్ లో 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 5వ స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోటీపడనుంది. సీజన్‌ తొలి భాగంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుదే పైచేయిగా నిలిచింది. ఈ క్రమంలో ఈ రోజు మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ రాయల్స్ జట్టు భావిస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం కాకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు జట్లకు చాలా అవసరం.

గత రికార్డులను పరిశీలిస్తే ఇరు జట్లు 26 మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా బెంగళూరు 13 మ్యాచ్‌ల్లో, రాజస్థాన్ 10 మ్యాచుల్లో విజయాలు సాధించాయి. 3 మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విషయానికొస్తే.. గత మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి ఆర్‌సీబీని 68 పరుగులకే కుప్పకూల్చారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో కలిసికట్టుగా రాణించి మళ్ళీ గెలుపు బాట పట్టాలని ఆర్సీబీ భావిస్తోంది. నేటి మ్యాచ్‌ కోసం బెంగళూరు జట్టు ఒకే ఒక మార్పు చేసే అవకాశం ఉంది. ఓపెనర్ అనుజ్ రావాత్ స్థానంలో యువ ఆటగాడు మహిపాల్ లోమ్రోర్ తుదిజట్టులోకి రానున్నాడు.

అలాగే సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో అదరగొట్టే ప్రదర్శన చేస్తోంది. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండూ ఆ జట్టు వద్దే ఉన్నాయి. ఈ సీజన్లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న బట్లర్ ఇప్పటికే మూడు సెంచరీలు బాదాడు. 81.83 సగటుతో అతడు ఏడు మ్యాచ్‌ల్లో 491 పరుగులు చేశాడు. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ 7 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు. వీరిద్దరూ ఇదే ఆటతీరు కొనసాగిస్తే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కు ఎదురుండకపోవచ్చు… అయితే గత మ్యాచ్ లో తేలిపోయిన మెక్‌కాయ్ స్థానంలో నవ్‌దీప్ సైనీ తుదిజట్టులోకి వచ్చే అవకాశముంది.