Ind Beat Pak: రివేంజ్ అదిరింది.. పాక్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.

  • Written By:
  • Updated On - October 23, 2022 / 05:58 PM IST

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. పాకిస్థాన్‌ను 159 పరుగులకే కట్టడి చేశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్‌శర్మ అంచనాలకు తగ్గట్టే భారత పేసర్లు సత్తా చాటారు. తొలి ఓవర్‌లో భువనేశ్వర్ 1 పరుగే ఇవ్వగా.. రెండో ఓవర్ తొలిబంతికే అర్షదీప్‌సింగ్ బాబర్ అజామ్‌ను డకౌట్‌ చేశాడు. కాసేపటికే రిజ్వాన్‌కు కూడా పెవిలియ‌న్‌కు పంపించాడు. ఈ దశలో పాకిస్థాన్‌ను ఇఫ్తికార్ అహ్మద్, మసూద్ ఆదుకున్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. అక్షర్ పటేల్ వేసిన ఓ ఓవర్లో ఇఫ్తికార్ 3 సిక్సర్లు కొట్టడంతో పాక్ స్కోర్ వేగం పుంజుకుంది. హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న వెంట‌నే ఇఫ్తికార్ ఔట‌య్యాడు.ఇఫ్తికార్ 34 బాల్స్‌లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 51 రన్స్ చేశాడు. ఇదిలా ఉంటే పాక్ మిడిలార్డర్‌ను హార్థిక్ పాండ్యా దెబ్బకొట్టాడు. వరుస వికెట్లతో పాక్ స్కోరుకు బ్రేక్ వేశాడు. అయితే మసూద్ చివరి వరకూ క్రీజులో ఉండడంతో పాక్ స్కోర్ 150 దాటగలిగింది. మసూద్ 42 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో షాహీన్ అఫ్రిది 8 బంతుల్లో 16 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో అర్షదీప్‌ 32 పరుగులు ఇచ్చి 3 వితెట్లు, పాండ్యా 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ 22 పరుగులకు 1 వికెట్ పడగొడితే షమీ 1 వికెట్ తీశాడు.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ నిరాశపరిచారు. సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా త్వరగానే ఔటయ్యారు. ఈ దశలో విరాట్ కోహ్లీ , హార్థిక్ పాండ్యా ఆదుకున్నారు. పాక్ బౌలర్లపై ఎదురుదాడికి పరుగులు రాబట్టారు. ఆరంభంలో నిలకడగా ఆడిన ఈ జోడీ తర్వాత గేర్ మార్చింది. ముఖ్యంగా కోహ్లీ, పాండ్యా కొట్టిన సిక్సర్లు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. ఆసియాకప్‌తోనే ఫామ్‌లోకి వచ్చిన విరాట్ అదే జోరు కొనసాగిస్తే.. రీఎంట్రీ తర్వాత తనలో కొత్త ఆల్‌రౌండర్‌ను పరిచయం చేసిన పాండ్యా కూడా క్లాసిక్ షాట్లతో అదరగొట్టాడు. వీరిద్దరూ 113 పరుగులు జోడించడంతో భారత్ విజయం దిశగా సాగింది. చివరి ఓవర్లో విజయం కోసం 16 రన్స్ చేయాల్సి ఉండగా.. పాండ్యా, దినేశ్ కార్తీక్ ఔటవడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే కోహ్లీ, అశ్విన్‌ జట్టును గెలిపించారు. చివర్లో ఒత్తిడికి లోనైన పాక్ పలు తప్పిదాలు చేయడం కూడా కలిసొచ్చింది. ఈ విజయంతో టైటిల్ వేటను ఘనంగా ఆరంభించిన భారత్‌ తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.