Virat Kohli: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు ‘పూర్తిగా సిద్ధంగా’ ఉన్నారని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. అన్ని ఫార్మాట్లలో కోహ్లీ ప్రదర్శిస్తున్న స్థిరత్వం, ఫామ్, పరుగులు చేయాలనే కసి దీనికి ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడిన రాజ్‌కుమార్.. కోహ్లీని భారత క్రికెట్ జట్టులో అత్యంత నమ్మదగిన ఆటగాడిగా అభివర్ణించారు.
అద్భుతమైన ఫామ్‌లో కోహ్లీ
కోహ్లీ గురువు రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. చూడండి అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్ తరపున ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించి తనేంటో నిరూపించుకున్నాడు. అతను భారత జట్టులో అత్యంత నిలకడగా రాణించే ఆటగాడు. కాబట్టి 2027 వరల్డ్ కప్ ఆడేందుకు అతను అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడని నేను భావిస్తున్నాను అని చెప్పారు. 2025లో వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో కోహ్లీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. అతను 13 మ్యాచ్‌ల్లో 65.10 సగటుతో 651 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read: బాబు పై కేసుల కొట్టివేత, వైసీపీ నేతల ఏడుపు బాట
అదిరిపోయే పునరాగమనం
ఈ ఏడాది కోహ్లీ ఫామ్‌లోకి వచ్చిన విధానం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండుసార్లు డకౌట్ అయినప్పటికీ ఈ సీనియర్ బ్యాటర్ బలంగా పుంజుకున్నాడు. వరుసగా నాలుగు సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు సాధించడమే కాకుండా అందులో రెండింటిని సెంచరీలుగా మలిచాడు. ఒత్తిడిలో కూడా తానెంత గొప్పగా ఆడగలడో మరోసారి నిరూపించాడు.
డొమెస్టిక్ క్రికెట్‌లోనూ సత్తా
చాలా ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ ద్వారా దేశీవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టి వెంటనే తన ముద్ర వేశాడు. ఢిల్లీ తరపున ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 131 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన క్లాస్, ప్రశాంతత, మ్యాచ్ గెలిపించే నైపుణ్యాన్ని మరోసారి చాటుకున్నాడు.
లయను కొనసాగిస్తున్న కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్న ఫామ్‌ను కోహ్లీ దేశీవాళీ క్రికెట్‌లోనూ అంతే సులువుగా కొనసాగిస్తున్నాడని రాజ్‌కుమార్ శర్మ కొనియాడారు. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్ కోసం సెంచరీలు చేసిన అదే ఊపును నేడు కూడా కొనసాగించాడు. చాలా కాలం తర్వాత దేశీవాళీ క్రికెట్‌లోకి వచ్చి, ఢిల్లీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు అని ఆయన తెలిపారు.
