RCB Beats GT: గెలిచి నిలిచిన బెంగళూరు

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది.

  • Written By:
  • Updated On - May 20, 2022 / 12:54 AM IST

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. సమిష్టిగా రాణించి టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌ను నిలువరించింది. బ్యాటింగ్‌లో కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో డూ ఆర్ డై పోరులో గెలిచిన ఆర్‌సీబీ ఇక ఆశలన్నీ ముంబైపైనే పెట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై ఓడిస్తే ఆర్‌సీబీకి ప్లే ఆఫ్ అవకాశముంటుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. సాహా రాణించినా.. శుభమన్‌గిల్ నిరాశపరిచాడు. మాథ్యూ వేడ్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ధాటిగా ఆడిన వృద్ధిమాన్ సాహా 31 రన్స్‌కు రనౌట్‌ కావడంతో గుజరాత్ 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో హార్దిక్ పాండ్య కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. డేవిడ్ మిల్లర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. మిల్లర్, 25 బంతుల్లో 34 రన్స్‌కు ఔటయ్యాక గుజరాత్ స్పీడ్‌కు కాస్త బ్రేక్ పడింది. అయితే చివర్లో రషీద్ ఖాన్ 6 బంతుల్లోనే 2 సిక్సర్లు, 1 ఫోర్‌తో 19 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ 41 పరుగులు చేసింది. . ముఖ్యంగా ఆఖరు రెండు ఓవర్లలో 34 పరుగులు వచ్చాయి. పాండ్యా 47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో ఛేజింగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ ధాటిగా ఆడారు. గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ తొలి వికెట్‌కు 14.3 ఓవర్లలో 115 పరుగులు జోడించారు. ఈ సీజన్‌లో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. పాత విరాట్‌ను గుర్తుకుతెస్తూ క్లాసిక్ షాట్లతో అలరించాడు. కోహ్లీ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 రన్స్ చేయగా.. డుప్లెసిస్ 38 బంతుల్లో 5 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔటైనా.. అప్పటికే ఆర్‌సిబీ విజయం దాదాపుగా ఖాయమైంది. తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్‌తో కలిసి బెంగళూరు విజయాన్ని పూర్తి చేశాడు. మాక్స్‌వెల్ 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిస్తే.. దినేశ్ కార్తీ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో బెంగళూరు మరో 10 బంతులు మిగిలిండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా… పంజాబ్, హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక ఢిల్లీ, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌తో చివరి బెర్త్ ఎవరిదో తేలనుంది. ముంబై గెలిస్తే బెంగళూరు నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే బెంగళూరు ఇంటిదారి పడుతుంది.