Virat Kohli: సెమీస్ లో ఓటమిపై కోహ్లీ భావోద్వేగ ట్వీట్..!

టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది టీమిండియా.

  • Written By:
  • Updated On - November 11, 2022 / 05:38 PM IST

టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది టీమిండియా. ఈ ఓటమిపై భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి నిరాశను వ్యక్తం చేశాడు. T20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత టీమిండియా క్రికెటర్ కోహ్లీ తొలిసారి ట్వీట్ చేశాడు. “మా కలను సాకారం చేసుకోకుండానే ఆస్ట్రేలియన్ తీరాలను వీడాల్సి వస్తోంది. ఇందుకు మేము చాలా బాధపడుతున్నాము. అయితే ఎన్నో చిరస్మరణీయ జ్ణాపకాలను మా వెంట తీసుకువస్తున్నాం. ఇకపై మరింత ఎదిగేందుకు కృషి చేస్తాం’’ విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు.

టోర్నీలో విరాట్ కోహ్లీ నాల్గవ అర్ధశతకం, హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 68 పరుగులు చేయడంతో గురువారం అడిలైడ్ ఓవల్‌లో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్స్ జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ అద్భుతమైన అర్ధ సెంచరీలతో ఇంగ్లాండ్ జట్టును ఫైనల్స్ కు తీసుకెళ్లారు.

అంతేకాకుండా టీమిండియా ఆడిన అన్ని మ్యాచ్‌లలో భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులకు విరాట్ కృతజ్ఞతలు తెలిపాడు. “స్టేడియాలలో మాకు మద్దతు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో హాజరైన మా అభిమానులందరికీ ధన్యవాదాలు. ఈ జెర్సీని ధరించి మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తున్నాను’ అని కోహ్లీ ట్వీట్ లో రాసుకొచ్చాడు. కోహ్లీ టీ20 వరల్డ్ కప్ లో 136.40 స్ట్రైక్ రేట్‌తో ఆరు మ్యాచ్‌లలో 296 పరుగులు చేశాడు. నవంబర్ 13న MCGలో జరిగే ఫైనల్లో ఇంగ్లండ్, పాకిస్థాన్‌తో తలపడనుంది.