Vintage Virat Kohli: మెల్‌బోర్న్‌లో పేలిన ‘విరాట్‌’వాలా..!

గ్లాదేశ్‌తో ఆడితే ఏముంటుంది కిక్కు.. పాకిస్థాన్‌తోనే ఆడి గెలిస్తేనే మజా..

  • Written By:
  • Updated On - October 24, 2022 / 01:06 AM IST

బంగ్లాదేశ్‌తో ఆడితే ఏముంటుంది కిక్కు.. పాకిస్థాన్‌తోనే ఆడి గెలిస్తేనే మజా.. మన క్రికెట్ ఫ్యాన్స్ అనుకునే మాట ఇది. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో పాక్‌తో మ్యాచ్‌కు ముందు అభిమానులు మరోసారి ఈ మాట గుర్తు చేసుకున్నారు. వారి మాటను నిలబెడుతూ టీమిండియా ఉత్కంఠ పోరులో గెలిచింది. మరి ఈ విజయంలో ఛేజింగ్‌ కింగ్ కోహ్లీ అదరగొట్టేశాడు. దీవాళి సెలబ్రేషన్స్‌లో థౌజండ్‌ వాలా తరహాలో మెల్‌బోర్న్ స్టేడియంలో విరాట్ వాలా పేలింది.

మూడేళ్ళుగా పేలవ ఫామ్‌… టీమ్‌లో ప్లేస్‌ కూడా సందిగ్ధంలో పడిన పరిస్థితి.. ఇలాంటి దశలో ఆసియాకప్‌లో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అయినా కూడా టీ ట్వంటీ ప్రపంచకప్‌ ముందు కోహ్లీ ఫామ్‌ కొనసాగిస్తాడా లేదా అనే డౌట్స్. ఈ డౌట్స్ అన్నింటికీ పాక్‌తో మ్యాచ్ ద్వారా తెరదించేశాడు. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. అందరూ అనుకున్నట్టుగానే పాక్‌పై తన తిరుగులేని రికార్డును కొనసాగిస్తూ మెల్‌బోర్న్‌లో థజౌంట్ వాలా పేలాడు విరాట్ కోహ్లీ. మామూలు సందర్భాల్లో కంటే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడిన ఇన్నింగ్స్‌లకు ఎప్పుడూ విలువ ఉంటుంది. అన్నింటికీ మించి పాక్‌ లాంటి చిరకాల ప్రత్యర్థిపై చివరి వరకూ క్రీజులో ఉండి గెలిపిస్తే ఆ కిక్కే వేరు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఈ కిక్కును ఆస్వాదించాడు విరాట్.. ఫామ్ ఈజ్ టెంపరరీ.. క్లాస్ ఈజ్ పర్మినెంట్‌ క్రికెట్‌లో వినిపించే మాటను గుర్తు చేస్తూ సందర్భానికి తగ్గట్టు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే భారీ షాట్లకు పోకుండా.. మ్యాచ్‌ను గెలిపించాలన్న కసితో కనిపించిన కోహ్లీ చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. తనను ఛేజింగ్‌లో మొనగాడు అని ఎందుకు పిలుస్తారో మరోసారి అందరికీ గుర్తు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. సాధారణంగా మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లీ పాక్‌తో విన్నింగ్ ఇన్నింగ్స్ తర్వాత భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకోవడం కనిపించింది. ప్రపంచకప్‌ అందులోనూ ప్రత్యర్థి పాకిస్థాన్‌ ఎంతో ఒత్తిడి.. వీటన్నింటినీ తట్టుకుని విజయాన్ని అందించినందుకే ఆ భావోద్వేగమని ప్రత్యేకంగా చెప్పాలా.. ఏదైతేనేం పాక్‌పై తన బ్యాటింగ్‌తో అభిమానులకు దివాళీ గిఫ్ట్ ఇచ్చాడు కోహ్లీ.