Virat Kohli: సెంచరీ మ్యాచ్ తో ఫామ్ లోకి వస్తాడా ?

కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్...ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్. ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో మళ్లీ కోహ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 04:50 PM IST

కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్…ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్. ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో మళ్లీ కోహ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ తర్వాత విరామం తీసుకుంటున్న కోహ్లి త్వరలో ప్రారంభంకానున్న ఆసియా కప్‌ ద్వారా మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. ఈ టోర్నీ కోసం భారత సెలెక్టర్లు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాలో కోహ్లి చోటు దక్కించుకున్నాడు. గతకొంతకాలంగా పేలవ ఫామ్‌ కారణంగా ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఈ టీమిండియా మాజీ కెప్టెన్‌.. ఆసియా కప్‌లో పాక్‌ ప్రత్యర్ధిగా తన వందో టీ ట్వంటీ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఈ సెంచరీ మ్యాచ్ తో అయినా విరాట్ ఫామ్ లోకి రావాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో
కింగ్ కోహ్లి ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ దెబ్బ తిన్న పులిలా గర్జిస్తాడని.. దానికి తొలుత బలైపోయేది దాయాదేనని ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. కాగా, కోహ్లి గత మూడేళ్లుగా అడపాదడపా స్కోర్లు చేస్తున్నా.. మూడంకెల స్కోర్‌ మాత్రం సాధించలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని శతకం సాధించి 1000 రోజులు దాటిపోయింది. తాజాగా ఇంగ్లండ్‌తో ఆడిన సిరీస్‌లోనూ కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు.

ఓ టెస్ట్, రెండు టీ20లు, ఓ వన్డే ఆడి కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లి రీఎంట్రీ ఆసక్తికరంగా మారింది. కోహ్లీ ఇంతటి పేలవ ఫామ్ లో ఉండడం అతని కెరీర్ లోనే ఇదే మొదటిసారి. కెప్టెన్సీ భారం లేకున్నా కూడా కోహ్లీ ఫామ్ అందుకొలేక పోవడం ఇటు ఫాన్స్ తో పాటు అటు టీమ్ మేనేజ్ మెంట్ ను కూడా కలవర పెడుతోంది. ఈ కారణంగానే ఇంగ్లాండ్ తో సీరీస్ తర్వాత రెస్ట్ తీసుకున్నాడు. ఫ్యామిలీ తో సమయాన్ని ఆస్వాదించిన కోహ్లీ ఆసియా కప్ లో ఖచ్చితంగా పరుగుల వరద పారిస్తాడని ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు. అన్నింటికీ మించి టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు కోహ్లీ ఫామ్ అందుకోవడం చాలా ముఖ్యమని చెప్పాలి.