Virat Kohli: రికార్డులతో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ

ఏ ఆటగాడికైనా కెరీర్ లో ఒక బ్యాడ్ ఫేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సచిన్, గంగూలీ...ఇలా ప్రతీ ఒక్కరూ అలాంటి గడ్డు కాలాన్ని చవిచూసిన వారే.

  • Written By:
  • Publish Date - September 8, 2022 / 10:47 PM IST

ఏ ఆటగాడికైనా కెరీర్ లో ఒక బ్యాడ్ ఫేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సచిన్, గంగూలీ…ఇలా ప్రతీ ఒక్కరూ అలాంటి గడ్డు కాలాన్ని చవిచూసిన వారే. ఆ సమయంలో వచ్చే విమర్శలు, ఒత్తిడి, నిరాశ అన్నీ తట్టుకుని నిలబడి సత్తా చాటిన వారే. ఇప్పుడు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలాంటి స్టేజ్ లోనే ఉన్నాడు. దాదాపు మూడేళ్ళుగా అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ చేయని కోహ్లీ ఎదుర్కోని విమర్శ లేదు. ఇక కెరీర్ ముగిసినట్టేనన్న వ్యాఖ్యలూ వినిపించాయి.

దీనికి తోడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కూడా అలాంటి వార్తలకు బలం చేకూర్చింది. కెప్టెన్సీ ఒత్తిడి లేకున్నా విరాట్ ఫామ్ లోకి మాత్రం రాలేదు. అయితే ఆసియాకప్ వేదికగా మళ్ళీ ఫామ్ అందుకున్నాడు. రెండు హాఫ్ సెంచరీలతో కుదురుకున్నట్టే కనిపించినా మునుపటి బ్యాటింగ్ మాత్రం కనిపించలేదు. ఈ లోటును ఆప్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో తీర్చేశాడు. ఒకప్పటి కోహ్లీని గుర్తు చేస్తూ చెలరేగిపోయాడు. అలాంటి ఇలాంటి ఇన్నింగ్స్ కాదు టీ ట్వంటీల్లో సెంచరీతో రెచ్చిపోయాడు. ఐపీఎల్ లో శతకం చేసినా.. కోహ్లీకి అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లో మాత్రం ఇదే తొలి సెంచరీ. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 61 బంతుల్లో 122 పరుగులతో అదరగొట్టాడు.మొత్తంగా 71వ అంతర్జాతీయ సెంచరీని తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. అరుదైన రికార్డులను నెలకొల్పాడు.

అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంతో నిలిచి రికీ పాంటింగ్‌ను సమం చేశాడు. 1020 రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ సాధించాడు. చివరగా 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ శతకం సాధించిన విరాట్.. ఆ తర్వాత ఇప్పుడే సెంచరీ చేశాడు. 84 అంతర్జాతీయ మ్యాచ్‌ల తర్వాత కోహ్లీ శతకం సాధించాడు.టీ20ల్లో సెంచరీ చేసిన అతిపెద్ద భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ 33 ఏళ్ల 307 రోజుల వయస్సులో శతకం చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 31 సంవత్సరాల 299 రోజుల వయస్సులో సెంచరీ చేశాడు. అతడి తర్వాత రోహిత్ శర్మ 31 సంవత్సరాల 190 రోజుల వయస్సులో శతక్కొట్టాడు. అలాగే రోహిత్ శర్మ పేరిట ఉన్న మరో రికార్డును కూడా విరాట్ బద్దలు కొట్టాడు. టీ ట్వంటీ క్రికెట్ లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో రోహిత్ చేసిన 118 రన్స్ ఇప్పటి వరకూ ఉన్న రికార్డ్. తాజాగా ఆప్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో 122 పరుగులతో నాటౌట్ గా నిలిచిన విరాట్ ఆ రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్ తో టీ ట్వంటీల్లో వంద సిక్సర్ల రికార్డును కూడా కోహ్లీ అందుకున్నాడు. అలాగే టీ ట్వంటీల్లో 3500 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు.