Site icon HashtagU Telugu

India Outclass Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా భారీ విజయం

Bhuvaneshwar

Bhuvaneshwar

ఆసియాకప్ ను భారత్ జట్టు భారీ విజయంతో ముగించింది. సూపర్ 4 స్టేజ్ తొలి రెండు మ్యాచ్ లలో ఓడి ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న టీమిండియా నామమాత్రపు మ్యాచ్ లో ఆప్ఘనిస్థాన్ పై 101 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ లో కోహ్లీ సెంచరీతో రెచ్చిపోతే.. బౌలింగ్ లో భువనేశ్వర్ ఆప్ఘన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఫలితంగా గ్రాండ్ విక్టరీ అందుకుంది.
మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టులో పలు మార్పులు జరిగాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హార్థిక్ పాండ్య , చాహల్ కు రెస్ట్ ఇచ్చారు. దీంతో భారత జట్టుకు కెేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేశాడు. రాహుల్ తో కలిసి ఓపెనర్ గా దిగిన కోహ్లీ చెలరేగి ఆడాడు. భారీస్కోర్ చేయడమే లక్ష్యంతో వీరిద్దరూ ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రాహల్ , కోహ్లీ తొలి వికెట్ కు 119 పరుగులు జోడించారు. వీరిద్దరి జోరుకు 11ఓవర్లకే స్కోరు వంద దాటింది. రాహుల్ 41 బంతుల్లో 62 రన్స్ కు ఔటవగా.. కోహ్లీ మాత్రం మరింత రెచ్చిపోయాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ, 53 బంతుల్లో సెంచరీ చేశాడు. తద్వారా మూడేళ్ళ సెంచరీ విరామానికి తెరదించాడు. కోహ్లీ జోరుతో భారత్ 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. కోహ్లీ 61బంతుల్లో 12ఫోర్లు, 6సిక్సర్లతో 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విరాట్ విధ్వంసకర బ్యాటింగ్ కు ఆప్ఘనిస్థాన్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

213 పరుగుల లక్ష్యఛేదనలో ఆప్ఘనిస్థాన్ ను సీనియర్ పేసర్ భువనేశ్వర్ హడలెత్తించాడు. ఏ ఒక్క బ్యాటర్ నూ క్రీజులో కుదురుకోనివ్వలేదు. కనీసం సింగిల్స్ తీసేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా తనదైన పేస్ తో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. 21 పరుగులకే ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయింది. ఇందులో ఐదు వికెట్లు భువనేశ్వర్ కే దక్కాయంటే అతని జోరు అర్థం చేసుకోవచ్చు. భువి 4 ఓవర్లలో 4 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం ద్వారా కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. తర్వాత బ్యాటర్లను మిగిలిన బౌలర్లు పెవిలియన్ కు పంపడంతో ఆప్ఘనిస్థాన్ 111 పరుగులే చేయగలిగింది. అర్షదీప్ సింగ్ , దీపక్ హుడా, అశ్విన్ తలో వికెట్ తీసారు.దీంతో టీమిండియా ఆసియాకప్ ను విజయంతో ముగించింది.

 

Exit mobile version