Virat Kohli: విరాట్‌కోహ్లీ @ 200 మిలియన్లు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • Written By:
  • Updated On - June 8, 2022 / 08:43 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రన్‌ మెషిన్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు వచ్చి చేరాయి. కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లకు గుండెల్లో దడే.. ప్రస్తుతం ఫామ్‌లో లేకున్నా… కొన్నేళ్ళుగా అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ పర్వం కొనసాగుతూనే ఉంది. కేవలం ఆన్ ది ఫీల్డ్‌లోనే కాదు ఆఫ్ ది ఫీల్డ్‌లోనూ విరాట్‌కు తిరుగులేదనే చెప్పాలి. అటు బ్రాండింగ్‌లోనూ, ఇటు ఫాలోయింగ్‌లోనూ తనకు తానే పోటీగా మారిపోయాడు.

కోహ్లీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటమే కాకుండా.. తన లైఫ్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాడు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు విపరీతంగా ఉన్నారు. తాజాగా విరాట్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇన్‌స్టా గ్రామ్‌లో కోహ్లీ ఫాలోవర్స్‌ సంఖ్య 200 మిలియన్లు దాటిపోయింది. 20 కోట్ల ఫాలోవర్స్‌ మార్క్‌ను అధిగమించిన సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ కోహ్లీ.. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టాడు. 200 మిలియన్ల ఫ్యామిలీ అయ్యాం. ఇన్‌స్టాలో ఇంత సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలంటూ కోహ్లీ పోస్ట్ చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్లున్న అథ్లెట్లలో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. విరాట్ కంటే ముందు ఫుట్ బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ ఉన్నారు. రొనాల్డో 450 మిలియన్ల మంది, మెస్సీ 333 మిలియన్ల ఫాలోవర్లతో టాప్-2 స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే ఆసియాలో మాత్రం కోహ్లీనే టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తాడు. దీనికోసం ఆ సంస్థల నుంచి భారీ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఇదిలా ఉంటే గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో కోహ్లీ స్థానంలో రోహిత్‌శర్మ పగ్గాలు అందుకున్నాడు. కాగా ప్రస్తుతం కోహ్లీ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఐపీఎల్ 15వ సీజన్‌లోనూ పెద్దగా రాణించలేదు. అయితే ఇంగ్లాండ్ టూర్‌కు ముందు జరుగుతున్న సౌతాఫ్రికా సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతినిచ్చారు.