WTC Final 2023: కొడతారా…పడతారా.. ?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆసక్తికరంగా మారింది. దాదాపు 4 రోజులూ ఆసీస్ జట్టే పై చేయి సాధించగా.. నాలుగోరోజు భారత్ పర్వాలేదనిపించింది.

WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆసక్తికరంగా మారింది. దాదాపు 4 రోజులూ ఆసీస్ జట్టే పై చేయి సాధించగా.. నాలుగోరోజు భారత్ పర్వాలేదనిపించింది. భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో నిలకడగా ఆడినప్పటకీ..కీలక వికెట్లు చేజార్చుకోవడం ఇబ్బందిగా మారింది. అయితే కోహ్లీ , రహానే పార్టనర్ షిప్ తో మళ్ళీ పుంజుకున్న టీమిండియా విజయం కోసం పోరాడుతోంది.

నాలుగోరోజు ఆసీస్ దూకుడుగానే ఆడింది. వీలైనంత భారీ టార్గెట్ ను నిర్థేశించే ఉద్దేశంతో ఆ జట్టు బ్యాటర్లు ఎటాకింగ్ బ్యాటింగ్ చేసారు. గ్రీన్ 25 రన్స్ కు ఔటవగా.. అలెక్స్ క్యారీ, మిఛెల్ స్టార్క్ కీలక పార్టనర్ షిప్ తో ఆసీస్ మంచి స్కోర్ సాధించింది. గ్రీన్ అవుటైన తర్వాత నుండీ క్యారీ జోరు పెంచాడు. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ.. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. అతనికి మిచెల్ స్టార్క్ చక్కని సపోర్ట్ ఇచ్చాడు. క్యారీ 66 , స్టార్క్ 41 పరుగులు చేశారు. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ను 270 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. తద్వారా 444 పరుగులు భారీ టార్గెట్ ను టీమిండియా ముందుంచింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ , శుబ్ మన్ గిల్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్ కు 41 పరుగులు జోడించారు. గిల్ 18 రన్స్ కు ఔటైనప్పటకీ… రోహిత్ , పుజారా పార్టనర్ షిప్ అందించారు. నాలుగో వికెట్ కు 51 పరుగులు జోడించారు. వీరిద్దరి పార్టనర్ షిప్ తో మ్యాచ్ ఆసక్తికరంగా మారిన వేళ చివరి సెషన్ లో అనూహ్యంగా వికెట్లు కోల్పోయింది. ఒక ఓవర్ తేడాలో రోహిత్ శర్మ 43 , పుజారా 27 పరుగులకు వెనుదిరిగారు. ఈ దశలో విరాట్ కోహ్లీ, రహానే జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరూ చూడచక్కని షాట్లతో అలరించారు. రహానే, కోహ్లీ నాలుగో వికెట్ కు అజేయంగా 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ లకు 164 పరుగులు చేసింది. కోహ్లీ 44, రహానే 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయం కోసం భారత్ ఇంకా 280 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ కు 7 వికెట్లు కావాలి. కాగా ఓవల్ పిచ్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క టీం కూడా 300 సమీపంలోని టార్గెట్‌ను కూడా ఛేజ్ చేయలేకపోయాయి. చిట్టచివరగా 1902లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 263 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ ఛేదించింది. అయితే కోహ్లీ, రహానే భారీ ఇన్నింగ్స్ లు ఆడితే మ్యాచ్ ను గెలిచే అవకాశం కూడా ఉందనేది విశ్లేషకుల అంచనా.

Read More: WTC Final 2023: WTC ఫైనల్‌లో భారత ఓటమి ఖాయం: దినేష్ కార్తీక్