RCB Wins: విజయంతో బెంగుళూరు వేట షురూ… సెంటిమెంట్ కొనసాగించిన ముంబై

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కి ఒక అలవాటు ఉంది. తొలి మ్యాచ్ ఓడిపోవడం ఆ జట్టుకు సంప్రదాయం.

  • Written By:
  • Publish Date - April 2, 2023 / 11:09 PM IST

MI vs RCB : ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కి ఒక అలవాటు ఉంది. తొలి మ్యాచ్ ఓడిపోవడం ఆ జట్టుకు సంప్రదాయం. చాలా సీజన్లలో తొలి మ్యాచ్ మాత్రమే కాదు…ఫస్టాప్ మ్యాచ్ లలో వరుస పరాజయాలు చవి చూసి తర్వాత టైటిల్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా 16వ సీజన్ ను కూడా ముంబై ఓటమితో ఆరంభించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముంబైని చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై కేవలం 48 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ 1 , ఇషాన్ కిషన్ 10 , గ్రీన్ 5 , సూర్య కుమార్ యాదవ్ 15 రన్స్ కే ఔటయ్యారు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ముంబైని ఆదుకున్నాడు. స్టేడియం నలువైపులా షాట్లు కొడుతూ స్కోర్ పెంచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తిలక్ వర్మ బ్యాటింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. బౌండరీలు, సిక్సర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. చివరి రెండు ఓవర్లలో ముంబయి భారీగా పరుగులు సాధించింది. తిలక్ వర్మ దూకుడైన బ్యాటింగ్‌తో ముంబయి మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 46 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది.

సహజంగానే బెంగుళూరు స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో టార్గెట్ చేజింగ్ లో ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లీ , డుప్లేసిస్ రెచ్చిపోయారు. పసలేని ముంబై బౌలింగ్ లో భారీ షాట్లు కొడుతూ పరుగుల వరద పారించారు. పవర్ ప్లే లో బెంగుళూరు 53 రన్స్ చేయగా..ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడింది. కోహ్లీ , డుప్లేసిస్ తొలి వికెట్ కు 15 ఓవర్లలో 148 పరుగులు జోడించారు. 8 రన్స్ దగ్గర కోహ్లీ క్యాచ్ ను ఆర్చర్ జారవిడవడంతో ముంబై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఓపెనర్ల హాఫ్ సెంచరీలతో బెంగుళూరు విజయం ఖాయమైంది. చివర్లో వికెట్లు కోల్పోయినా సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువ లేకపోవడంతో బెంగుళూరు సునాయాసంగా గెలిచింది. డుప్లేసిస్ 43 బంతుల్లో 5 ఫోర్లు , 6 సిక్సర్లతో 73 , కోహ్లీ 49 బంతుల్లో 6 ఫోర్లు , 5 సిక్సర్లతో 82 రన్స్ చేశారు. దీంతో బెంగుళూరు 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.