Vinod Kambli : ఇప్పటి వాళ్లకు సరిగ్గా తెలియకపోవచ్చు గానీ.. 90 వ దశకంలో వినోద్ కాంబ్లీ పేరు తెలియని వారు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తో కలిసి స్కూల్ క్రికెట్‌లో కాంబ్లీ పలు రికార్డులను నెలకొల్పాడు. అందులో 664 పరుగుల భాగస్వామ్యం ఒకటి. దీంతో సచిన్‌తో పాటు కాంబ్లీ పేరు మారు మోగిపోయింది. చాలా తక్కువ సమయంలో భారత జట్టులో అడుగుపెట్టిన కాంబ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో కొన్నాళ్లు స్టార్ ఆటగాడిగా కొనసాగాడు.
1993-2000 మధ్య భారత్ తరఫున ఆడాడు. 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 1084 పరుగులు వన్డేల్లో 2477 పరుగులు సాధించాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఓ దశలో సచిన్‌తో పోటీపడి పరుగులు చేశాడు. సచిన్ స్థాయికి అందుకునే సత్తా ఉన్నప్పటికి, వ్యక్తిగత క్రమశిక్షణ లోపించడం వల్ల అతడి కెరీర్ అర్థాంతరంగా ముగిసిందని అతడి సన్నిహితులు చెబుతుంటారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తరువాత అతడు పెద్దగా వెలుగులోకి రాలేదు. అతడి సమకాలికులు ఏదో ఓ రకంగా లైమ్‌లైట్‌లో ఉన్నప్పటికీ అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. కాగా.. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కనీసం తనకు తానుగా నడవలేకపోతున్నాడు. పక్కన ఇద్దరు మనుషుల సాయం లేనిదే అడుగువేయలేకపోతున్నాడు. నిలబడే ఓపిక లేక బైక్ సపోర్టు తీసుకోవడం..ఆ తరువాత ఆయన కిందపడబోతుంటే ఇద్దరు వ్యక్తులు చేతులతో పట్టుకుని నిల్చోబెట్టడం, భుజాలపై మోసుకుంటూ తీసుకురావడం ఆ వీడియోలో కనిపించింది.
2013లో కాంబ్లీ గుండెపోటులకు గురైయ్యాడు. యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. వ్యక్తిగత సమస్యల కారణంగా అతడు మద్యానికి బానిస అయ్యాడని, ఆర్థిక చితికిపోయాడని పలుమార్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం వీడియో వైరల్ కావడంతో అయ్యో కాంబ్లీ ఇలా అయ్యావేంటి..? అంటూ పలువురు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read :Avinash Sable: మరో పతకంపై ఆశలు.. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో ఫైనల్‌కు చేరిన భారత అథ్లెట్..!