Site icon HashtagU Telugu

Vinod Kambli: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై కేసు నమోదు.. కారణమిదే..?

Vinod Kambli

Resizeimagesize (1280 X 720) 11zon (1)

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఈసారి అతడికి వ్యతిరేకంగా భార్య ఆండ్రియా పోలీసులను ఆశ్రయించింది. ఆండ్రియా ఫిర్యాదు మేరకు ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంబ్లీ తనను, తన కుమారుడిని ఏ కారణం లేకుండా దూషించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ముంబై పోలీసులు తెలిపారు.

బాంద్రా పోలీసుల ప్రకారం.. కాంబ్లీపై IPC సెక్షన్లు 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరచడం), 504 (అవమానం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆండ్రియా ఫిర్యాదుకు సంబంధించి పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. బాంద్రా ప్లాట్‌కు మద్యం మత్తులో వచ్చిన కాంబ్లీ భార్యతో గొడవ పడ్డాడని ఫిర్యాదులో ఉందని తెలిపారు. అంతేకాకుండా వంట గదిలోకి వెళ్లి వంట పాన్ హ్యాండిల్ తీసుకొని ఆండ్రియాపై విసిరాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పాడు. తలకు గాయం కావటంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేకంటే ముందు ఆండ్రియా భాభా ఆస్పత్రిలో చికిత్స పొందిందని అన్నారు. కారణం లేకుండా తనను, తమ కుమారుడిపై కాంబ్లీ దుర్భాషలాడాడని ఆండ్రియా తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.

Also Read: Celebrity Cricket League 2023: ఫిబ్రవరి 18 నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్..!

కాంబ్లీ మద్యం మత్తులో అర్థరాత్రి ఇంటికి వచ్చాడు. భార్యను కొట్టడమే కాకుండా కొడుకును కూడా దుర్భాషలాడాడు. 12 ఏళ్ల కొడుకు కాంబ్లీని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతను అంగీకరించలేదు. కుమారుడిని దుర్భాషలాడి ఆపై భార్యను కొట్టాడు. అయితే, ఈ సమస్య పరిష్కారమవుతోందని ఆండ్రియా తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడి ఘటన తర్వాత ఆండ్రియా తొలుత భాభా ఆస్పత్రికి వెళ్లింది. ఆ తర్వాత కేసు పెట్టాలని నిర్ణయించుకుని పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

వినోద్ కాంబ్లీ భారత్ తరఫున మొత్తం 104 వన్డేలు, 17 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను మొత్తం 3,561 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం ఆరు సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో నాలుగు సెంచరీలు, వన్డే క్రికెట్‌లో రెండు సెంచరీలు చేశాడు. 1991లో కెరీర్ ప్రారంభించిన కాంబ్లీ కేవలం తొమ్మిదేళ్లకే కెరీర్ ముగించాడు. అతను 2000లో తన చివరి మ్యాచ్ ఆడాడు. అతని సహచరుడు సచిన్ 24 సంవత్సరాలు దేశం కోసం ఆడి అనేక రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.