Site icon HashtagU Telugu

Wrestling Gold: రెజ్లింగ్ లో మరో స్వర్ణం… టీటీ లో ఖాయమైన రెండో మెడల్స్

Wrestling Federation Of India

Wrestling Federation Of India

కామన్ వెల్త్ గేమ్స్ రెజ్లింగ్ లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే ఆరు మెడల్స్ గెలిచిన భారత్ ఇవాళ మరో రెండు పతకాలు సాధించింది. పురుషుల విభాగంలో రవి దాహియ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 57 కేజీల కేటగిరీలో పోటీ పడిన దాహియా అంచనాలకు తగ్గట్టుగా రాణించాడు.

ఈ కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు ఇది పదో స్వర్ణం. భారత్‌ ఖాతాలో ఇవాళ మరో రెండు కాంస్య పతకాలు కూడా చేరాయి. 50 కేజీల మహిళల రెజ్లింగ్ కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ పూజా గెహ్లాట్ 12-2 తేడాతో స్కాట్లాండ్ రెజ్లర్‌ లెచిజోపై విజయం అందుకుంది . అండర్ 23 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన పూజా గెహ్లాట్‌కి ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్.
అటు మహిళల బాక్సింగ్‌ 60 కేజీల విభాగంలో భారత బాక్సర్ జాస్మిన్ లంబోరియా కాంస్య పతకం సాధించింది. ఇంగ్లాండ్ బాక్సర్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 2-3 తేడాతో పోరాడి ఓడిన జాస్మిన్ లంబోరియా… కాంస్యంతో సరిపెట్టుకుంది.

ఇదిలా ఉంటే టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్, మిక్స్‌డ్ డబుల్స్, మెన్స్ డబుల్స్ ఈవెంట్లలో ఫైనల్‌కి చేరి రెండు పతకాలు ఖాయం చేసుకున్నాడు. సాథియన్‌తో కలిసి మెన్స్ డబుల్స్‌ ఆడిన శరత్ కమల్, ఆస్ట్రేలియా జోడీ నికోలస్ లమ్, ఫెన్ లూపై 3-2 తేడాతో విజయం అందుకుని ఫైనల్ చేరాడు. అలాగే మిక్స్‌డ్ డబుల్స్‌లో శ్రీజ ఆకులతో కలిసి బరిలో దిగిన శరత్ కమల్, ఆస్ట్రేలియా మిక్స్‌డ్ జోడీ నికోలస్ లమ్- మిన్హుండ్ జీపై 3-1 తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్‌ చేరాడు. ఇక భారత స్టార్ ప్లేయర్ మానికా బత్రా పోరాటం ముగిసింది. కామన్వెల్త్ మెడల్ లక్ష్యంగా బరిలో దిగిన మానికా బత్రా…మహిళల సింగిల్స్‌, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్‌లలో క్వార్టర్ ఫైనల్‌లోనే ఓడింది.

Exit mobile version