Abhishek Sharma : ఐపీఎల్ కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఊచకోత కోశాడు. అభిషేక్ ప్రస్తుతం పంజాబ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం అభిషేక్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న అతని ఇన్నింగ్స్ 93 పరుగుల వద్ద ముగిసింది.
విజయ్ హజారే ట్రోఫీ లో అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ తుఫాను బ్యాటింగ్‌తో ముందుకు సాగాడు. మరో 7 పరుగుల దూరంలో అభిషేక్ శతకాన్ని చేజార్చుకున్నాడు. 72 బంతుల్లో 93 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు. అభిషేక్ తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన అభిషేక్ హైదరాబాద్ పై సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ తనయ్ వికెట్ పడగొట్టడంతో అది సాధ్యపడలేదు. అంతకుముందు సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 170 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబైపై కూడా 66 పరుగులు చేశాడు. కాగా అభిషేక్ విధ్వంసానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సంబరపడిపోతుంది. తమ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వచ్చే సీజన్లో అదే ఫామ్‌తో ఆడాలని కోరుకుంటుంది.
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అభిషేక్ శర్మ ఆడనున్నాడు. ఫ్రాంచైజీ అతడిని రూ.14 కోట్లకు తన వద్దే ఉంచుకుంది. అతని గణాంకాలు చూస్తే… అభిషేక్ శర్మ ఐపీఎల్ లో ఇప్పటివరకు 63 మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను 155.24 స్ట్రైక్ రేట్ మరియు 25.50 సగటుతో 1377 పరుగులు చేశాడు. ఈ సమయంలో 7 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అభిషేక్ 128 ఫోర్లు, 73 సిక్సర్లు కొట్టాడు.