టీమిండియాలో ప్రస్తుతం యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పేరు మారుమ్రోగుతోంది. అనూహ్యంగా ఈ ఆటగాడు భారత జట్టులోకి దూసుకొచ్చాడు. జట్టులో చోటు సంపాదించుకోవడమే కాకుండా తన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. బాల్, బ్యాటుతో రాణిస్తున్నాడు.గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరం కావడంతో వెంకటేశ్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న వెంకటేశ్ తాజాగా జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ ప్రస్తుతం అదరగొడుతున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో మిడిలార్డర్‌లో కీలక సమయంలో విలువైన పరుగులు చేస్తున్నాడు.
అదే సమయంలో టీమిండియాకు ఫినిషర్ లోటును వెంకటేశ్ అయ్యర్ తీర్చుతున్నాడని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ఇటీవల విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కీలక సమయంలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన అయ్యర్ 92 పరుగులతో అదరగొట్టాడు. అవరసమైనప్పుడు బంతితోనూ రాణిస్తూ వికెట్లు తీస్తున్నాడు. మూడో టీ20 మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో హార్దిక్ పాండ్యా చోటు భర్తీ చేయగల ఆటగాడు వెంకటేశ్ అయ్యరేనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జట్టులో వెంకటేశ్ అయ్యర్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని చెప్పుకోవాలి.
దీంతో హార్దిక్ పాండ్యా మళ్లీ జట్టులోకి తిరిగి రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొందరైతే టీమిండియాలో ఇక హార్దిక్ పాండ్యా కథ ముగిసినట్టేనని చెబుతున్నారు. కాగా ప్రస్తుతం ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకు దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్యా.. గతంలో అనేక మ్యాచ్‌ల్లో బ్యాట్, బాల్‌తో రాణించి టీమిండియాను గెలిపించాడు.