వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 63 బంతుల్లోనే సెంచ‌రీ!

విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున ఆడిన వైభవ్ సూర్యవంశీ అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Published By: HashtagU Telugu Desk
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాపై జరిగిన మూడో యూత్ వన్డే మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించాడు. కేవలం 63 బంతుల్లోనే వంద పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. సెంచరీ చేసే సమయానికి అతని ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఈ అండర్-19 సిరీస్‌లో భారత జట్టుకు సూర్యవంశీ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అంతకుముందు జరిగిన రెండో వన్డేలో కూడా అద్భుత అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

భారత్- దక్షిణాఫ్రికా అండర్-19 జట్ల మధ్య యూత్ వన్డే సిరీస్ జనవరి 3న ప్రారంభమైంది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సారథ్యంలో భారత జట్టు ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లోనూ విజయం సాధించింది. మూడో వన్డేలో సూర్యవంశీ, మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్‌తో కలిసి తొలి వికెట్‌కు 227 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Also Read: ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల‌కు గుడ్ న్యూస్‌!

24 బంతుల్లోనే ఫిఫ్టీ

వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌ను చాలా దూకుడుగా ప్రారంభించాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆయన తర్వాతి 50 పరుగులు చేయడానికి 39 బంతులు తీసుకున్నాడు. సూర్యవంశీ 9 మ్యాచ్‌ల లిస్ట్-ఏ కెరీర్‌లో ఇది రెండో సెంచరీ.

ఈ మూడో యూత్ వన్డేలో సూర్యవంశీ మొత్తం 74 బంతుల్లో 127 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో ఆయన 9 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. గతంలో అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై 171 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో ఆయన తన మొదటి లిస్ట్-ఏ సెంచరీని నమోదు చేశాడు.

పరుగుల వరద పారిస్తున్న వైభవ్

విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున ఆడిన వైభవ్ సూర్యవంశీ అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆయన మెరుపు సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు తన 9 మ్యాచ్‌ల లిస్ట్-ఏ కెరీర్‌లో వైభవ్ సూర్యవంశీ మొత్తం 480 పరుగులు సాధించాడు.

  Last Updated: 07 Jan 2026, 03:36 PM IST