Site icon HashtagU Telugu

Robin Uthappa Retires: క్రికెట్‌కు రాబిన్ ఊతప్ప గుడ్‌బై

Robin Uthappa Faces Arrest Warrant

టీమిండియా క్రికెటర్ రాబిన్ ఊతప్ప రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. భారత జట్టుకు, సొంత రాష్ట్రం కర్టాటకు ప్రాతినిథ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పాడు. తన 20 ఏళ్ళ కెరీర్‌లో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 36 ఏళ్ళ ఊతప్ప 46 వన్డేలు, 13 టీ ట్వంటీలు ఆడాడు. వన్డేల్లో 934 పరుగులు , టీ ట్వంటీల్లో 249 పరుగులు చేశాడు. 2006లో ఇంగ్లాండ్‌పై వన్డే అరంగేట్రం చేసిన ఊతప్ప ఓపెనర్‌గా పలు డాషింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. దూకుడైన ఓపెనర్‌గా పలు అద్భుత ఆరంభాలు ఇచ్చాడు. 2007 టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో ఊతప్ప కూడా సభ్యునిగా ఉన్నాడు.

ఆ టోర్నీలో పాక్‌పై మ్యాచ్‌ టైగా ముగిసినప్పుడు బౌల్ అవుట్‌లో సక్సెస్ అయ్యాడు. జాతీయ జట్టు తరపున తక్కువ మ్యాచ్‌లే ఆడినప్పటకీ ఐపీఎల్‌లో అదరగొట్టాడు. ఆరంభ సీజన్‌ నుంచీ అత్యంత నిలకడగా రాణించిన కొద్ది మంది క్రికెటర్లలో ఊతప్ప ఒకడు. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 27 హాఫ్ సెంచరీలతో 4 వేల 952 పరుగులు చేశాడు. దూకుడైన ఓపెనర్‌గా పేరున్న ఊతప్ప పలుసార్లు వికెట్‌ కీపర్‌గానూ రాణించాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్, పుణే వారియర్స్, రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్‌కింగ్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో 2014 సీజన్ ఊతప్ప కెరీర్‌లో అత్యుత్తమంగా చెప్పుకోవచ్చు.

ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున పరుగుల వరద పారించాడు. 660 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 2012, 2014లలో కోల్‌కతా జట్టు టైటిల్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2021లో టైటిల్ సాధించిన చెన్నై జట్టులోనూ ఊతప్ప సభ్యునిగా ఉన్నాడు. కాగా ప్రతీ విషయానికీ ఏదో ఒక దశలో ముగింపు ఉంటుందని, తాను కూడా క్రికెట్‌తో తన అనుబంధానికి ముగింపు పలుకుతున్నట్టు ట్వీట్‌లో పేర్కొన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన ఊతప్పకు అభిమానులు, మాజీ క్రికెటర్లు విషెస్ చెబుతున్నారు.