US Open 2022 : యూఏస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత స్వైటెక్..!!

వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ ఇగా స్వైటెక్ ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ టైటిల్ యూఎస్ ఓపెన్ ను సొంతం చేసుకుంది.

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 03:21 PM IST

వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ ఇగా స్వైటెక్ ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ టైటిల్ యూఎస్ ఓపెన్ ను సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె ట్యూనీషియాకు చెందిన జాబెర్ పై 6-2, 7-6 స్కోర్ తో విజయం సాధించింది. స్వైటెక్ కెరీర్ లో ఇది మూడో గ్రాండ్ శ్లామ్ టైటిల్. ఫేవరెట్ గా బరిలోకి దిగిన స్వైటెక్ తుదిపోరులో అదరగొట్టింది. తొలి సెట్ ను సునాయాసంగానే గెలుచుకుంది. అయితే రెండో సెట్ లో ప్రత్యర్థి జాబెర్ సర్వీస్ ను నిలుపుకోవడంతో టై బ్రేక్ కు దారి తీసింది.

టై బ్రేక్ లో జాబెర్ గట్టిగానే పోరాడినప్పటకీ.. 7-5 స్కోర్ తో స్వైటెక్ మ్యాచ్ ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో 2016 తర్వాత ఒకే సీజన్ లో రెండు గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ సాధించిన మొదటి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఈ టైటిల్ ఆమె పలు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ గెలిచిన తొలి పోలండ్ క్రీడాకారిణిగా ఘనత సాధించింది. ఈ ఏడాది మూడు సార్లు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో సెమీస్ చేరిన స్వైటెక్ రెండుసార్లు విజేతగా నిలిచింది. ఒక టాప్ సీడ్ ప్లేయర్ యూఎస్ ఓపెన్ గెలవడం 8 ఏళ్ళ తర్వాత ఇదే తొలిసారి. 2014లో సెరెనా టాప్ సీడ్ గా బరిలోకి దిగి టైటిల్ గెలిచింది. మిగిలిన క్రీడాకారిణులతో పోలిస్తే హార్డ్ కోర్టులో స్వైటెక్ చాలా బలమైన ప్లేయర్ గా పేరు తెచ్చుకుంది.