WTC Points Table: ఫైనల్ బెర్త్ భారత్ కే రెండో ప్లేస్ రేసులో ఉన్న జట్లు ఇవే

డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. ఫైనల్ రేసులో టీమిండియా ముందుంది. టెస్ట్ ఫార్మాట్ లోనూ నిలకడగా రాణిస్తున్న భారత జట్టు ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.

WTC Points Table: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ రేసు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. పాయింట్ల పట్టికలో పలు జట్ల స్థానాలు మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా టాప్ 3లో ఉన్న జట్లు ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడుతుంటాయి. ఈ సారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. ఫైనల్ రేసులో టీమిండియా ముందుంది. టెస్ట్ ఫార్మాట్ లోనూ నిలకడగా రాణిస్తున్న భారత జట్టు ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. 2023 నుంచి 2025 సైకిల్ లో ఇప్పటి వరకూ 9 టెస్టు ఆడిన రోహిత్ సేన ఆరు విజయాలు సాధించింది. రెండింటిలో ఓడి, మరో మ్యాచ్ ను డ్రాగా ముగించింది. తద్వారా 68.51 విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్ లో ఇంకా 10 టెస్టులు ఆడనున్న భారత్ కు ఫైనల్ చేరాలంటే కనీసం ఐదు విజయాలు కావాలి.

స్వదేశంలో బంగ్లాదేశ్ తో , అనంతరం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. స్వదేశంలో రోహిత్ సేన హాట్ ఫేవరేట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన భారత్ కు సవాల్ కానుంది. ఆసీస్ టూర్ లో సిరీస్ గెలవకున్నా ఘోరపరాభవం పాలవకుండా ఉంటే టీమిండియా సునాయాసంగా ఫైనల్‌కు చేరుతుంది. గత రెండుసార్లు ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన టీమిండియా ఈ సారి కూడా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం మనకు పెద్ద కష్టం కాదనే చెప్పాలి. గతంలో రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత జట్టు రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొదటి సారి న్యూజిలాండ్ చేతిలోనూ, తర్వాత ఆసీస్ చేతిలోనూ పరాజయం పాలైన టీమిండియా ఈ సారి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది.

ఇదిలా ఉంటే రెండో స్థానం కోసం ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ , శ్రీలంక రేసులో ముందున్నాయి. ఈ రెండు జట్లు 50 విజయాల శాతంతో కొనసాగుతుండగా.. విండీస్ పై విజయంతో ఇంగ్లాండ్ కూడా ఆశలు నిలుపుకుంది. వెస్టిండీస్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిస్తే అయిదో స్థానంలో ఉన్న పాకిస్థాన్ ను ఇంగ్లండ్‌ అధిగమించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ల్లో గెలిస్తే ఇంగ్లండ్ రెండో ప్లేస్ కోసం ఫేవరేట్‌‌గా నిలిచే అవకాశం ఉంది. మొత్తం మీద టాప్ ప్లేస్ భారత్ కే ఖాయమవనుండగా.. రెండో ప్లేస్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Also Read: Vijay : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌ని ఫాలో అవుతున్న విజయ్..? పాదయాత్రతో జనాల్లోకి..

Follow us