Pakistan v England: ఆడుతోంది టెస్టా.. వన్డేనా..? పాక్ పై ఇంగ్లాండ్ రికార్డుల మోత

సొంత గడ్డపై పాకిస్థాన్ బౌలర్లకు ఇంతకన్నా ఘోర అవమానం మరొకటి ఉండదు.

  • Written By:
  • Publish Date - December 2, 2022 / 09:31 AM IST

సొంత గడ్డపై పాకిస్థాన్ బౌలర్లకు ఇంతకన్నా ఘోర అవమానం మరొకటి ఉండదు. ఇంగ్లీష్ బ్యాటర్లు రెచ్చిపోయిన వేళ రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు రికార్డుల మోత మోగింది. పాక్ బౌలర్లను చితక్కొట్టిన ఇంగ్లీష్ తొలి రోజే 500 పైగా రన్స్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌ లతోపాటు ఓలీ పోప్‌ , హ్యారీ బ్రూక్‌ సెంచరీల మోత మోగించారు. తొలి రోజే నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం కూడా వరల్డ్‌ రికార్డే. వెలుతురు సరిగా లేక ఆట ముగిసే సమయానికి కేవలం 75 ఓవర్లలోనే 4 వికెట్లకు 506 రన్స్‌ చేసింది. ఒకవేళ మొత్తం 90 ఓవర్ల ఆట జరిగి ఉంటే ఇంగ్లండ్‌ మరిన్ని రికార్డులను అందుకునేది. ఓపెనర్లు ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 233 రన్స్ జోడించారు. ఆ తర్వాత 50 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది.

తొలి రోజు ఇంగ్లండ్‌ ఏకంగా ఓవర్‌కు 6.74 రన్‌రేట్‌తో పరుగులు సాధించింది. పాక్‌ బౌలర్లలో కేవలం మహ్మద్‌ అలీ మాత్రమే ఓవర్‌కు ఆరు పరుగుల కంటే తక్కువ రన్స్‌ ఇచ్చాడు. మిగిలిన బౌలర్లు అందరూ 6 కంటే ఎక్కువ ఎకానమీతో రన్స్ ఇచ్చారు. ఈ స్కోరుతో ఇంగ్లాండ్ 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 1910లో ఆస్ట్రేలియా , సౌతాఫ్రికాపై నెలకొల్పిన రికార్డును ఇంగ్లాండ్ అధిగమించింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 34 రన్స్ తో క్రీజులో ఉన్నాడు. రెండో రోజు ఫస్ట్ సెషన్‌లో వేగంగా ఆడి ఇంగ్లండ్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది.