Unfair Treatment: బీసీసీఐ సెలక్టర్లపై సంజూ శాంసన్ ఫ్యాన్స్ ఫైర్

ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా వన్డే, టీ ట్వంటీ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 04:13 PM IST

ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా వన్డే, టీ ట్వంటీ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లకు ఒక మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చి… మళ్ళీ మిగిలిన మ్యాచ్ లకు ఎంపిక చేయడం సరికాదంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ అభిమానులు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఇంగ్లాండ్ టూర్ లో కేవలం తొలి టీ ట్వంటీకి మాత్రమే సంజూ శాంసన్ కు చోటు దక్కింది. విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌లాంటి ప్లేయర్స్‌ ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌ ఆడుతూ బిజీగా ఉండటం వల్ల అతన్ని ఎంపిక చేశారు. తర్వాతి మ్యాచ్ లకు వాళ్లంతా రీ ఎంట్రీ ఇవ్వనుండడంతో సంజూను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ట్విట్టర్ లో సంజూ శాంసన్ విషయమే ట్రెండింగ్ లో ఉంది. అన్ ఫెయిర్ విత్ సంజూ శాంసన్ అంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
దారుణంగా ఫెయిలవుతున్న రిషబ్‌ పంత్‌ను కొనసాగిస్తూ సంజు శాంసన్‌ను పక్కడపెట్టడమేంటని ఒకరు ప్రశ్నించారు. ఇక మరొక అభిమాని అయితే.. సంజు శాంసన్‌ రిటైర్‌ కావాలని, ఆ తర్వాత ఇంగ్లండ్‌ లేదా ఆస్ట్రేలియా టీమ్స్‌కు ఆడాలని సూచిస్తున్నారు. మరో ట్విటర్‌ యూజర్‌ స్పందిస్తూ.. ఇలా అయితే టీమిండియా ఎప్పటికీ వరల్డ్‌కప్‌ గెలవదని బీసీసీఐని తిట్టిపోశాడు. అతడు ఆడినా, ఆడకపోయినా శాంసన్‌ టాలెంట్‌ను బీసీసీఐ వృథా చేస్తోందని మరొకరు మండిపడ్డారు. బాలీవుడ్‌లో నెపోటిజం ఉన్నట్లే ఇండియన్‌ క్రికెట్‌లోనూ ఉన్నదని, సంజు శాంసన్‌కు అండగా ఉండాలని చాలామంది ట్వీట్లు చేయడం చర్చనీయాంశమైంది.

మొదటి నుంచీ భారత క్రికెట్ లో సంజూ శాంసన్ ఎంపిక వ్యవహారం చర్చకు దారితీస్తూనే ఉంటుంది.
టీమ్‌లోకి ఇలా రావడం, అలా వెళ్లడం అతనికి అలవాటుగా మారింది. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా బ్యాట్‌తో మెరుపులు మెరిపించే శాంసన్‌.. ఇటీవల తన స్థాయికి తగిన ఆట ఆడకపోయినా ఫర్వాలేదనిపించాడు. తాజాగా ఐర్లాండ్‌తో ఆడిన టీ20ల్లో 77 రన్స్‌ చేశాడు. సంజు శాంసన్‌కు అన్యాయం జరిగిన మాట వాస్తవేమనని సబా కరీమ్‌లాంటి మాజీ చీఫ్‌ సెలక్టర్లు కూడా చెబుతున్నారు. అయితే ఇవన్నీ పక్కపెట్టి అతడు భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలని సబా కరీమ్‌ అన్నాడు. ప్రస్తుతం భారత జట్టులో వికెట్‌ కీపర్లు చాలా మందే ఉన్నారు. టీ20 వరల్డ్‌కప్‌ కోసం కూడా రిషబ్‌ పంత్‌తోపాటు ఇషాన్‌ కిషన్‌, దినేష్‌ కార్తీక్‌ పోటీ పడుతున్నారు. సంజు శాంసన్‌ కూడా వికెట్‌ కీపరే. అయితే అతన్ని ఇంగ్లండ్‌ సిరీస్‌కు పక్కన పెట్టిన సెలక్టర్లు.. వరల్డ్‌కప్ టీమ్‌ రేసులో అతడు లేడని ముందే చెప్పేశారంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. పలు సందర్భాల్లో వచ్చిన అవకాశాలను అతను సద్వినియోగం చేసుకోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద సంజూ శాంసన్ ను పక్కన పెట్టడం భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.