IPL: ఐపీఎల్ పై ఆ వ్యాఖ్యలు సరికావు

ఇటీవల టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత్ జట్టు సెమీస్ లో నిష్క్రమించింది.

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 04:25 PM IST

ఇటీవల టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత్ జట్టు సెమీస్ లో నిష్క్రమించింది. ఐపీఎల్ లో పలు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తూ చెలరేగిపోయే భారత క్రికెటర్లు మెగా టోర్నీలో మాత్రం కలిసికట్టుగా రాణించలేకపోతున్నారు. దీంతో వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమి తర్వాత ఐపీఎల్ కారణంగానే భారత్ మెగా టోర్నీల్లో సరిగా ఆడడం లేదన్న విమర్శలు వినిపించాయి. తాజాగా ఈ విమర్శలపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. వరల్డ్ కప్ లో భారత్ ఓటమికి ఐపీఎల్ ను నిందించడం సరికాదన్నాడు.

ఐపీఎల్ భారత క్రికెట్ ను మరో స్థాయిలో నిలబెట్టిందన్నాడు. ముఖ్యంగా ఆటగాళ్ళ ప్రతిభను వెలికితీసేందుకు వారికి ఆర్థిక పరంగా అండగా నిలిచేందుకు ఈ లీగ్ ఉపయోగపడిందన్న విషయాన్ని ఎవ్వరూ మరిచిపోకూడదన్నాడు. ఎంతోమంది యువ ఆటగాళ్ళు ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టుకు ఎంపికైన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించాడు. టీమిండియా ఓడిన ప్రతీసారీ ఐపీఎల్ ను తప్పుపట్టడం తనను బాధిస్తుందన్నాడు.

ఇదిలా ఉంటే టీమిండియా కోచ్ గా స్వదేశీ ఆటగాళ్ళను ఎంపిక చేస్తుండడం మంచి పరిణామమని గంభీర్ వ్యాఖ్యానించాడు. బీసీసీఐ నిర్ణయాన్ని అభినందించిన గంభీర్ స్వదేశీ ఆటగాళ్ళకే జట్టు పరిస్థితులు మరింత లోతుగా తెలుస్తాయన్నాడు. ఎందుకంటే క్రికెట్ భావోద్వేగంతో కూడుకున్నదని, దానిని బాగా అనుభవించి వారే సరిగ్గా నడిపిస్తారన్నాడు. బిగ్ బాష్ లాంటి విదేశీ లీగ్స్ లో భారత మాజీ ఆటగాళ్ళకు కోచింగ్ బాధ్యతలు ఇవ్వరన్న విషయాన్ని గంభీర్ గుర్తు చేశాడు. ఇక బీసీసీఐ తన నిధుల్లో 50 శాతాన్ని ఒలింపిక్ క్రీడల కోసం వెచ్చించాల్సిన అవసరముందని సూచించాడు.