India Vs Pakisthan : సూపర్‌ సండే…సూపర్-4 ఫైట్

ఆసియాకప్ టైటిల్ వేటలో లీగ్ స్టేజ్‌ను ఘనంగా ముగించిన టీమిండియా ఇప్పుడు సూపర్ 4 పోరుకు సిద్ధమైంది.

  • Written By:
  • Publish Date - September 4, 2022 / 09:36 AM IST

ఆసియాకప్ టైటిల్ వేటలో లీగ్ స్టేజ్‌ను ఘనంగా ముగించిన టీమిండియా ఇప్పుడు సూపర్ 4 పోరుకు సిద్ధమైంది. ముందు నుంచీ ఊహించినట్టుగానే సూపర్ 4 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడబోతోంది. లీగ్ స్టేజ్‌ మ్యాచ్‌లో పాక్‌ను నిలువరించిన భారత్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మెగా టోర్నీల్లో ఎక్కువసార్లు టీమిండియా ఆధిపత్యమే కొనసాగుతుండగా.. గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో మాత్రం పాక్‌దే పైచేయిగా నిలిచింది. దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్న భారత్ సూపర్‌ 4లోనూ జైత్రయాత్ర కొనసాగించాలని ఉవ్విళ్ళూరుతోంది. ఉత్కంఠగా జరిగిన గత మ్యాచ్‌లో హార్థిక్ పాండ్యా మెరుపులతో భారత్ విజయం సాధించింది. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి వచ్చారు. అయితే ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశముంది. హార్థిక్ పాండ్యా జట్టులోకి తిరిగిరానుండగా.. గాయంతో దూరమైన జడేజా స్థానంలో అక్షర్ పటేల్, అశ్విన్‌లలో ఒకరికి చోటు దక్కనుంది. భారీగా పరుగులిస్తున్న అవేశ్ ఖాన్ స్థానంలో దీపక్ హుడాకు చోటు దక్కొచ్చు. అయితే రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఎవరిని కొనసాగిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.టాస్‌ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉండటంతో ఫినిషర్‌ పాత్రలో కార్తీక్‌నే కొనసాగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా గత మ్యాచ్‌లో భారత ఓపెనర్లు సరైన ఆరంభాన్నివ్వలేకపోయారు. సూపర్ 4 మ్యాచ్‌లో రోహిత్‌,రాహుల్ ఫామ్ అందుకోవాలని టీమ్ కోరుకుంటోంది.

మరోవైపు పాకిస్థాన్‌ గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. బౌలింగ్‌లో రాణించినా పాక్ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో అన్ని విభాగాల్లోనూ గాడిన పడితే తప్ప టీమిండియాను ఓడించడం పాక్‌కు కష్టమే. కెప్టెన్ బాబర్ అజామ్ ఫామ్‌లో లేకపోవడంతో పాక్‌కు మైనస్ పాయింట్. భారత్‌తో పోరులోనైనా అతను ఫామ్‌లోకి రావాలని పాక్‌ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్‌ షాహనవాజ్‌ దహనీ పక్కటెముకల గాయంతో టీమిండియా మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో దహనీ స్థానంలో ముహ్మద్‌ హస్నైన్‌, హసన్‌ అలీలలో ఎవరు ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న దుబాయ్ పిచ్‌పై ఛేజింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు.