Umran Malik: బంగ్లాతో వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ పేసర్ ఔట్.. ఉమ్రాన్ మాలిక్ ఇన్..!

బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్ లో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ టీమిండియా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు.

  • Written By:
  • Publish Date - December 3, 2022 / 12:50 PM IST

బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్ లో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ టీమిండియా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. బంగ్లాతో వన్డే సిరీస్‌కు ముందు శిక్షణా సెషన్‌లో మహ్మద్ షమీ భుజానికి గాయమైనట్లు BCCI పత్రికా ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత జట్టులో గాయపడిన పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ చోటు దక్కించుకున్నాడు. “బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ట్రైనింగ్ సెషన్‌లో భుజం గాయంతో బాధపడ్డాడు. అతను ప్రస్తుతం బెంగళూరులోని NCAలో BCCI వైద్య బృందం సంరక్షణలో ఉన్నాడు’’ ని బీసీసీఐ ఒక పత్రికా ప్రకటనలో బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేసింది.

షమీ గాయం ఏ స్థాయిలో ఉందో ఇంకా తెలియరాలేదు. మీ 60 టెస్టుల్లో 216 వికెట్లు తీశాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ ఒకడు. మాలిక్ ఇటీవల న్యూజిలాండ్‌లో తన ODI అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్‌ సిరీస్ లో రెండు మ్యాచ్‌లు ఆడిన మాలిక్ రెండు వికెట్లు సాధించాడు. ఆదివారం జరిగే తొలి వన్డేతో భారత్.. బంగ్లాదేశ్ పర్యటనను మొదలుపెట్టనుంది. మూడు వన్డేల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఢాకా‌లోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. తొలి వన్డే ఆదివారం జరగనుండగా.. రెండో వన్డే డిసెంబర్ 7న, మూడో వన్డే డిసెంబర్ 10న జరగనుంది.

ఇటీవల న్యూజిలాండ్‌లో భారత పర్యటన ముగిసింది. ఈ టూర్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకోగా, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-0తో న్యూజిలాండ్‌ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌తో 3 వన్డేల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు బంగ్లాదేశ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడేందుకు సిద్ధంగా ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగే ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, KL రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ODIలలో ఇరు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డ్ చూస్తే.. ఇప్పటివరకు భారతదేశం- బంగ్లాదేశ్ మధ్య 36 వన్డేలు జరిగాయి. వీటిలో టీమిండియా 30 మ్యాచ్‌లు గెలవగా, బంగ్లాదేశ్ 5 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.