Clash at CWG 2022: హాకీ మ్యాచ్‌లో బాహాబాహీ

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

  • Written By:
  • Publish Date - August 5, 2022 / 08:28 PM IST

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పోటీ పడుతున్నామనే విషయం మరిచి ఇద్దరు హాకీ ఆటగాళ్లు బాహాబాహీకి దిగారు. చొక్కాలు పట్టుకుని ఒకరినొకరు నెట్టేసుకున్నారు. సహచర ఆటగాళ్లు వచ్చి వారిని విడదీయకపోతే మరింత రచ్చ జరిగేది.

సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ కెనడాతో తలపడింది. పూల్‌ బీలో జరిగిన ఈ మ్యాచ్‌లో సగం సమయం ముగియడానికి కొన్ని నిమిషాల ముందు ఈ గొడవ జరిగింది. కెనడా ప్లేయర్‌ బాల్‌రాజ్‌ పనేసర్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు క్రిస్‌ గ్రిఫిత్స్‌ మధ్య వివాదం తలెత్తింది. అప్పటికే ఇంగ్లండ్‌ 4-1తో ఆధిక్యంలో ఉంది. ఆట కొనసాగుతున్నప్పుడు గ్రిఫిత్స్‌ బంతిని తీసుకునే ప్రయత్నం చేయగా.. పనేసర్‌ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఒకరినొకరు చొక్కాలు పట్టుకునే వరకూ వెళ్లింది.

ఒకానొక సమయంలో పనేసర్ గ్రిఫిత్స్‌ గొంతు కూడా పట్టుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. సహచర ఆటగాళ్లు వచ్చి ఇద్దరినీ విడదీసేందుకు శ్రమించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హాకీలో రెజ్లింగ్‌ చూశామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఘర్షణపై రిఫరీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి ఆటగాళ్ళపైనా చర్యలు తీసుకున్నారు.