R Ashwin: ఐపీఎల్ లో అశ్విన్ అరుదైన రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సృష్టించాడు.

  • Written By:
  • Updated On - May 12, 2022 / 10:05 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సృష్టించాడు. లీగ్ చరిత్రలో తొలి హాఫ్ సెంచరీ చేసేందుకు ఎక్కువ ఇన్నింగ్స్ లు ఆడిన రెండో క్రికెటర్ గా నిలిచాడు. ఇంతకీ మొదటి హాఫ్ సెంచరీ చేసేందుకు అశ్విన్ ఆడిన ఇన్నింగ్స్ లు 72. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో యాష్ ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లోనే కాదు మొత్తం టీ20 క్రికెట్‌లో అతనికిది తొలి హాఫ్ సెంచరీ. దాదాపు 15 ఏళ్ల తర్వాత 277వ మ్యాచ్ లో అశ్విన్ ఫిఫ్టీ సాధించాడు.
చరిత్రలో తొలి అర్ధసెంచరీ సాధించేందుకు అత్యధిక ఇన్నింగ్స్‌ల సమయం తీసుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చెన్నై ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొలి అర్ధశతకం సాధించేందుకు ఏకంగా 132 ఇన్నింగ్స్‌ల సమయం తీసుకున్నాడు. వీరిద్దరి తర్వాత తొలి హాఫ్ సెంచరీ సాధించేందుకు హర్భజన్‌ 61 , స్టీవ్‌ స్మిత్‌ 31 ఇన్నింగ్స్‌లు ఆడారు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అశ్విన్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోట్‌ చేసింది. టాప్‌ ఫామ్‌లో ఉన్న బట్లర్‌ తక్కువ స్కోరుకే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. తన పించ్‌ హిట్టర్‌ రోల్‌కు న్యాయం చేశాడు. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లోనే శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టి బాదుడు మొదలుపెట్టాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ స్టాన్స్‌ కూడా ఫ్యాన్స్‌కు వింతగా అనిపించింది. అతడు పూర్తిగా కిందికి వంగి.. క్రీజుపై కూర్చొంటున్నట్లుగా నిలబడి బ్యాటింగ్‌ చేయడం ఆశ్చరపరిచింది. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో అశ్విన్‌ తన తొలి హాఫ్ సెంచరీ చేశాడు. 37 బాల్స్‌లోనే అశ్విన్‌ ఈ ఫిఫ్టీ చేయడం విశేషం. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో అతడే టాప్‌ స్కోరర్‌. అశ్విన్‌ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ చూసి నెటిజన్లు షాక్‌ తిన్నారు. ఈ ఐపీఎల్‌లో అశ్విన్‌ నుంచి ఇంకా ఎన్ని అద్భుతాలు చూడాలో అంటూ కామెంట్‌ చేశారు.