Women’s Premier League: మహిళల క్రికెట్ లో నవశకం

దేశంలో మహిళల క్రికెట్‌కు మరో కీలక మలుపుగా చెబుతున్నారు విశ్లేషకులు.

  • Written By:
  • Updated On - January 26, 2023 / 01:01 PM IST

మహిళల ఐపీఎల్లా… అబ్బే ఎవరు చూస్తారంటూ పెదవి విరిచిన వారందరికీ దిమ్మతిరిగే షాక్‌… ప్రపంచ మహిళల క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీస్తూ త్వరలో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. అంబానీ నుంచి అదానీ వరకూ బడా కార్పొరేట్ దిగ్గజాలు మహిళా ఫ్రాంచైజీలను దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. దీంతో దేశంలో మహిళల క్రికెట్‌కు మరో కీలక మలుపుగా చెబుతున్నారు విశ్లేషకులు.

దేశంలో మహిళల క్రికెట్‌ను బీసీసీఐ టేకోవర్ చేసిన తర్వాత ఎలాంటి డెవలప్‌మెంట్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పురుషుల జట్టు తరహాలోనే వారికి అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తూ వస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో మాత్రమే కాదు దేశవాళీ క్రికెట్‌లోనూ సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించబోతోంది. బీసీసీఐ ఊహించినట్టుగానే మహిళల ఐపీఎల్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ కనిపిస్తోంది. ఇటీవలే మీడియా ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడైతే.. ఇప్పుడు వుమెన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం దిగ్గజ కార్పొరేట్ సంస్థలు క్యూ కట్టాయి. మహిళల ఐపీఎల్ ఎవరు చూస్తారంటూ తక్కువ అంచనా వేసిన వారందరికీ షాకిస్తూ రికార్డు ధర పలికాయి. అంబానీ, అదానీ , జీఎంఆర్‌ వంటి దిగ్గజ సంస్ధలు బిడ్లు సొంతం చేసుకోవడంతో వుమెన్స్ క్రికెట్‌కు పెరిగిన క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. మహిళల ఐపీఎల్‌ ఆలోచన ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ 17 సంస్థలు బిడ్లను దాఖలు చేయగా.. ఐదు ఫ్రాంచైజీలూ కలిపి 4 వేల 669 కోట్లకు అమ్ముడయ్యాయి.

5 జట్లలో మూడింటిని ఐపీఎల్‌ను నడిపిస్తున్న సంస్థలే దక్కించుకున్నాయి. పురుషుల ఐపీఎల్‌లో టీమ్ కోసం గట్టిగా ప్రయత్నించి విఫలమైన అదానీ స్పోర్ట్స్ అహ్మదాబాద్ మహిళల ఐపీఎల్ జట్టును సొంతం చేసుకుంది. వుమెన్స్ ఐపీఎల్‌లో అహ్మదాబాద్ టీమ్‌ను అదానీ గ్రూప్ 1289 కోట్లకు దక్కించుకుంది. ముంబై టీమ్‌ను అంబానీకి చెందిన ఇండియావిన్ స్పోర్ట్స్ 912.9 కోట్లకు కొనుగోలు చేయగా.. బెంగళూరు టీమ్‌ను ఆర్‌సీబీ స్పోర్ట్స్ 901 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఢిల్లీ ఫ్రాంచైదీని జెఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్‌ క్రికెట్‌ 810 కోట్లకూ, లఖ్‌నవూ టీమ్‌ను కాప్రి గ్లోబల్ 757 కోట్లకు దక్కించుకున్నాయి. మహిళల ఐపీఎల్‌లో ఒక్కో టీమ్ కవీసం 500 నుంచి 800 కోట్ల వరకూ పలుకుతుందని అంచనా వేయగా అంతకంటే ఎక్కువగానే అమ్ముడవడంతో బీసీసీఐ జోష్‌ను మరింత పెంచింది. వచ్చే నెలలో క్రికెటర్ల వేలం నిర్వహించనుండగా… వుమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్‌ మార్చిలో మొదలవుతుంది.