Virat Kohli T20 in doubt: కోహ్లీ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా ?

భారత్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - April 27, 2022 / 02:35 PM IST

భారత్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ లో పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు కూడా వదులుకున్నా కూడా పరుగులు చేయలేక పోతున్నాడు. ఐపీఎల్
15వ సీజన్ తో నైనా గాడిన పడతాడనుకుంటే అదే జరగలేదు. సీజన్ లో సగం మ్యాచ్ లు పూర్తయి పోయినా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేక పోయాడు. ఈ సీజన్ లో కోహ్లీ హయ్యెస్ట్ స్కోర్ 48 మాత్రమే. 9 మ్యాచ్ లలో అయిదు సార్లు సింగిల్ డిజిట్ కే ఔటవగ…ఇందులో రెండు డకౌట్ లు ఉన్నాయి.కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్ల అవుతోంది. 2016 ఐపీఎల్ సీజన్ లో ఏకంగా 4 సెంచరీలు కొట్టిన కోహ్లీ ఇప్పుడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతుండటంతో అభిమానులు బాధ పడుతున్నారు.

ఒకప్పుడు పరుగుల వరద పారించి రన్ మెషీన్ గా పిలిపించుకున్న కోహ్లీనేనా ఆడుతోంది అని ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు. యువ బౌలర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేక పోతున్న కోహ్లీ ఫామ్ ఇప్పుడు బీసీసీఐ సెలక్టర్లకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపద్యంలో కోహ్లీ టీ ట్వంటీ జట్టులో స్థానం కోల్పోయే అవకాశం ఉందని ఓ బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే సెలక్షన్ కమిటీ సభ్యులు చర్చించినట్టు వెల్లడించారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే సౌత్ ఆఫ్రికాతో జరిగే టీ ట్వంటీ సీరీస్ కు కోహ్లి ని పక్కన పెట్టే అవకాశం ఉందని సమాచారం.

అటు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం జట్టు ఎంపికలో కోహ్లి ను పరిగణలోకి తీసుకోవడం పై ఇప్పుడే ఏం చెప్పలేమని బీసీసీఐ సెలక్టర్ ఒకరు చెప్పారు. ఈ పరిణామాలు చూస్తుంటే కోహ్లీ అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేననీ పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కోహ్లీకి మద్దతు గా నిలిచే వాళ్ళు మాత్రం అతను మళ్ళీ పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్ళు కోహ్లీ బ్రేక్ తీసుకొని మళ్ళీ మైదానంలో అడుగు పెట్టాలని రవి శాస్త్రి లాంటి వాళ్ళు సూచిస్తున్నారు.