Site icon HashtagU Telugu

IPL 2022 : ఐపీఎల్ మెగా వేలానికి ఆ ఆటగాళ్ళు దూరం

Mulling

Mulling

ప్రపంచ క్రికెట్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు స్టార్ క్రికెటర్ల నుండి యువ ఆటగాళ్ళ వరకూ ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. ఈ లీగ్ లో ఆడితే డబ్బుకు డబ్బు.. పేరుకు పేరుతో పాటు మంచి ఫాలోయింగ్ వస్తుంది. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదలుకోకుండా ఆడేందుకు ఆసక్తిగా ఉంటారు. అయితే ఈ సారి జరగనున్న సీజన్ లో మాత్రం పలువురు స్టార్ ప్లేయర్స్ దూరం కానున్నారు. వచ్చే నెలలో జరగనున్న మెగా వేలం ముంగిట ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ప్లేయర్స్ అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు. ఈ రెండు దేశాలకు చెందిన పలువురు ఆటగాళ్ళు ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌ జో రూట్‌, ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్‌, ఆస్ట్రేలియా టెస్ట్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, ఆస్ట్రేలియా స్టార్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్‌ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

సుదీర్ఘ ఫార్మాట్ పై దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశ్యంతో జో రూట్‌.. మెగా వేలానికి దూరం అవుతున్నట్లు ప్రకటించగా.. ప్యాట్ కమిన్స్‌, మిచెల్ స్టార్క్‌, బెన్ స్టోక్స్‌లు వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం​. వీరిలో కమిన్స్‌ అంతకుముందు సీజన్ లో కేకేఆర్‌ తరఫున ఆడగా.. బెన్ స్టోక్స్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ జట్టుకు ఆడాడు. ఇక మిచెల్ స్టార్క్ చివరిసారిగా ఐపీఎల్ 2015 సీజన్‌లో ఆడాడు.. ఇక మరోవైపు జో రూట్ కూడా ఈ సారి ఐపీఎల్ లో పాల్గొన‌డం లేద‌ని తాజాగా ప్ర‌క‌టించాడు. నిజానికి కొద్ది రోజుల ముందు ఈ సారి ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంటాన‌ని రూట్ చెప్పినా. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ దారుణంగా ఓడిపోవ‌డంతో త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడు. తాను త‌న జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించ‌డానికే తొలి ప్రాధాన్యం ఇస్తాన‌ని చెప్పాడు. ఇక రూట్ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సారి కూడా ఐపీఎల్‌లో ఆడలేదు. అటు బెన్ స్టోక్స్ కూడా ఇదే బాటలో నడిచాడు. యాషెస్ సిరీస్ ఘోర పరాజయంతోనే ఇంగ్లాండ్ క్రికెటర్లు ఐపీఎల్ నుండి తప్పుకున్నట్టు అర్థమవుతోంది. యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ 0-4 తో చిత్తుగా ఓడింది. ఈ పరాభవం తర్వాత తమ ఆటగాళ్ళ ప్రదర్శనపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

Exit mobile version