Site icon HashtagU Telugu

Team India : మార్పులకు టైం వచ్చిందా ?

Team India New

Team India New

భారత క్రికెట్ జట్టు డౌన్‌ఫాల్ మొదలైందా… కోహ్లీ కెప్టెన్సీ రాజీనామా ఎపిసోడ్‌ తర్వాత జట్టులో ఏం జరుగుతోంది…డ్రెస్సింగ్‌ రూమ్‌లో వాతారణం సరిగా లేదన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం అభిమానుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచేందుకు ఇదే సరైన సమయం… ప్రత్యర్థి బలహీనంగా ఉంది… టెస్ట్ ఫార్మేట్‌లో ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ జట్లను ఓడించిన మనకు సౌతాఫ్రికాలో విజయం ఈ సారి అందడం ఖాయం… ఇదీ దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వినిపించిన అభిప్రాయం. అయితే మైదానంలోకి వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా రివర్సయింది. తొలి టెస్టులో గెలిచి సిరీస్‌పై ఆశలు రేకెత్తించిన భారత్ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం… సిరీస్ చేజార్చుకోవడం జరిగాయి. అనంతరం వన్డే సిరీస్‌లోనూ సఫారీలదే పూర్తి ఆధిపత్యం..ఒక్క విజయం కూడా లేకుండా 0-3తో వైట్‌వాష్‌ పరాభవం ఎదుర్కొంది టీమిండియా. ప్రస్తుత వరల్డ్‌క్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉన్న భారత్‌కు ఇది జీర్ణించుకోలేని ఓటమే. అసలు ఈ పరాభవానికి కారణాలను విశ్లేషిస్తే.. పర్యటనకు ముందు కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తప్పించడం, దానిపై కోహ్లీ బహిరంగంగానే బీసీసీఐ సెలక్టర్ల తీరును విమర్శించడం హాట్‌టాపిక్‌గా మారింది. జట్టులో ఏదో జరుగుతుందన్న వార్తలు వినిపించాయి.

టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత టెస్ట్ కెప్టెన్సీకి కూడా కోహ్లీ రాజీనామా చేయడానికి బీసీసీఐతో చెడిన సంబంధాలే కారణమని అందరికీ అర్థమైంది. అటు రోహిత్‌శర్మ ఫిట్‌నెస్ కారణాలతో అందుబాటులో లేకపోవడంతో కెఎల్ రాహుల్ వన్డే సారథిగా వ్యవహరించాడు. అయితే కెప్టెన్‌గా వ్యూహాలు అమలు చేయడంలో రాహుల్ పూర్తిగా ఫెయిలయ్యాడు. అటు మిడిల్ ఆర్డర్‌ పేలవ ఫామ్ జట్టు ఓటమికి మరో కారణంగా చెప్పొచ్చు. మూడు వన్డేల్లోనూ మిడిలార్డర్‌ బ్యాటర్లు ఏ ఒక్కరూ రాణించలేదు. అలాగే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు పట్టువదిలేయడం ఒక కారణం. ఈ బలహీనతను సఫారీ టీమ్ సద్వినియోగం చేసుకుని పరుగులు రాబట్టింది. అన్నింటికీ మించి రాహుల్ కెప్టెన్సీలో దూకుడే కాదు వ్యూహం కూడా లోపించిందనేది మాజీల విశ్లేషణ. కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పినట్టు సఫారీ టూర్ భారత జట్టుకు ఓ మేలుకొలుపు లాంటిదే. ఈ టూర్ నుండి పాఠాలు నేర్చుకోకుంటే కష్టమేనని చెప్పొచ్చు. అదే సమయంలో వన్డే ప్రపంచకప్‌ కోసం జట్టు కూర్పుకు సంబంధించి ఇప్పటి నుండే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Exit mobile version