Team Australia:టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఆసీస్ జట్టు ఇదే

సొంతగడ్డపై జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా అందరి కంటే ముందుగా జట్టును ప్రకటించింది.

  • Written By:
  • Updated On - September 1, 2022 / 02:21 PM IST

సొంతగడ్డపై జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా అందరి కంటే ముందుగా జట్టును ప్రకటించింది. ఊహించినట్టుగానే పలువురు స్టార్ ఆటగాళ్ళను ఎంపిక చేసింది. అయితే అనూహ్యంగా సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేయనున్నాడు. అతన్ని ప్రాబబుల్స్ లో తీసుకుంటున్నట్టు గతంలోనే ఫించ్ చెప్పగా… ఇప్పుడు 15 మంది జాబితాలో చోటు దక్కించుకున్నాడు. సింగపూర్‌లో పుట్టిన టిమ్ డేవిడ్‌.. ఆస్ట్రేలియాలో పెరిగాడు. టీ ట్వంటీ ఫార్మేట్ లో గత కొంత కాలంగా సంచలన ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. పవర్ హిట్టర్ గా టిమ్ కు మంచి పేరుంది. గతేడాది పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లోకి వచ్చిన టిమ్ డేవిడ్ ను ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కూడా టీమ్‌లోకి తీసుకుంది. వరల్డ్ వైడ్ గా జరుగుతున్న పలు లీగ్స్ లో అతను సత్తా చాటినందునే ఎంపిక చేసామని ఆసీస్ సెలక్టర్ జార్జ్ బెయిలీ చెప్పాడు.

టిమ్ రాకతో తమ బ్యాటింగ్‌ మరింత లోతుగా ఉంటుందనన్నాడు. కాగా ప్రపంచకప్ కోసం ఆసీస్ జట్టులో టిమ్ డేవిడ్ తప్పిస్తే మిగిలిన వారి ఎంపిక అంతా ఊహించిందే. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ కంటే ముందు సెప్టెంబర్‌ భారత్ కు రానున్న ఆస్ట్రేలియా మూడు టీ టీ ట్వంటీల సిరీస్ ఆడనుంది. అయితే బిజీ షెడ్యూల్ దృష్ట్యా భారత్ తో సిరీస్ కు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇండియా టూర్ తర్వాత అతను వరల్డ్ కప్ కోసం జట్టుతో కలవనున్నాడు. సెప్టెంబర్‌ 20న మొహాలి వేదికగా ఆసీస్ , భారత్ టీ ట్వంటీ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది.

టీ20 ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్‌), అష్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్‌ కెప్టెన్‌), టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మూథ్యూ వేడ్ , డేవిడ్ వార్నర్