Site icon HashtagU Telugu

MI beats DC: ముంబై గెలుపుతో ప్లే ఆఫ్ కు బెంగుళూరు

Mumbai Indains

Mumbai Indains

ఐపీఎల్ 15వ సీజన్ చివరి ప్లే ఆఫ్ బెర్తును రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ముంబై విజయం సాధించడంతో మెరుగైన రన్ రేట్ కారణంగా ఆర్సీబీ ముందంజ వేసింది. పలు క్యాచ్ కు వదిలేయడం, పేలవ ఫీల్డింగ్ ఢిల్లీ ఓటమికి కారణమయ్యాయి.

వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 159 పరుగులు చేసింది. అంచనాలు పెట్టుకున్న వార్నర్ , మిచెల్ మార్ష్ నిరాశ పరిచారు. దీంతో పవర్ ప్లే పూర్తవకముందే 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అయితే రోమన్ పావెల్ 43 , కెప్టెన్ రిషభ్ పంత్ 39 రన్స్ తో రాణించారు. వీరిద్దరూ 75 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో చెలరేగగా.. రమణ్‌దీప్ సింగ్ 2 వికెట్లతో పడగొట్టాడు. డేనియల్ సామ్స్, మయాంక్ మార్కండే, చెరో వికెట్ తీసుకున్నారు.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. ఆరంభంలో నిదానంగా ఆడింది. ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. కిషన్‌ వేగంగా ఆడేందుకు ప్రయత్నించినా, రోహిత్‌ శర్మ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. రోహిత్ ఔట్ అయ్యాక ఇషాన్ కిషన్ , బ్రేవిస్ ధాటిగా ఆడారు. ఇషాన్ 48 పరుగులు చేయగా… బ్రెవిస్ 37 రన్స్ తో చెలరేగాడు. చివర్లో టీమ్ డేవిడ్ కూడా వేగంగా ఆడడంతో ముంబై విజయం ఖాయమైంది. తిలక్ వర్మ ఔట్ అయినా రమణ దీప్ సింగ్ ముంబై విజయాన్ని పూర్తి చేశాడు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే,శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్‌ తీసాడు. దీంతో సీజన్ ను విజయంతో ముగించిన ముంబై బెంగళూరును ప్లే ఆఫ్ కు చేర్చింది.