టీ ట్వంటీ(T20)ల్లో ఒక సెంచరీ (100 Runs) చేయడమే గొప్ప ఘనత… అలాంటిది రెండు శతకాలు (Two Centuries) సాధిస్తే..అది కూడా వరుసగా విదేశీ గడ్డపై శతక్కొడితే ఆ కిక్కే వేరు… ఇలాంటి అరుదైన మైల్ స్టోన్ ను అందుకున్నాడు మన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma).. ప్రస్తుతం టీమిండియా (Team India)లో ప్రతీ ప్లేస్ కూ విపరీతమైన పోటీ ఉంది… దీంతో 30,40 రన్స్ తో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునే పరిస్థితి లేదు.. ఒకటిరెండు మ్యాచ్ లు ఫెయిలయితే ప్లేస్ గల్లంతవుతుంది. ఈ విషయాన్ని హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ త్వరగానే గ్రహించాడు. అందుకే ఐపీఎల్ లో నిలకడగా రాణించినా జాతీయ జట్టులో కొనసాగాలంటే అంతర్జాతీయ స్థాయిలోనూ దుమ్మురేపాల్సిందేనని అర్థం చేసుకున్నాడు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుంటే కష్టమేనని తెలుసుకున్న తిలక్ వర్మ తాజాగా సఫారీ పర్యటన (South Africa Tour)లో రెండు సెంచరీలు బాదేశాడు. సెంచూరియన్ లో శతకం చేసిన తిలక్ వర్మ మళ్ళీ వాండరర్స్ స్టేడియంలో సెంచరీ కొట్టాడు.
నిజానికి సంజూ శాంసన్ (Sanju Samson) తో పోలిస్తే కాస్త ఆలస్యంగా వచ్చిన తిలక్ వర్మ ఓ రేంజ్ లో విధ్వంసం సృష్టించాడు. మొదటి 50 రన్స్ ను 22 బాల్స్ లో పూర్తి చేసుకున్న ఈ హైదరాబాదీ క్రికెటర్ తర్వాతి 50 పరుగులను 19 బంతుల్లోనే అందుకున్నాడు. సంజూ శాంసన్ 82 పరుగుల దగ్గర ఉండగా ఫిఫ్టీ కొట్టిన తిలక్ వర్మ తర్వాత గేర్ మార్చి ఎడాపెడా బాదేశాడు. తిలక్ సెంచరీలో 6 ఫోర్లు, 9 సిక్సర్లుండగా.. అంతర్జాతీయ క్రికెట్ లో వరుసగా రెండు శతకాలు చేసిన రెండో భారత క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. నిజానికి తిలక్ వర్మ సక్సెస్ వెనుక సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయమే కారణమని చెప్పాలి. ఎప్పుడూ నాలుగో స్థానంలో తిలక్ బ్యాటింగ్ కు వస్తే… సూర్యకుమార్ (Suryakumar) మూడో ప్లేస్ లో దిగేవాడు. కానీ సెంచూరియన్ మ్యాచ్ కు ముందు తిలక్ వర్మ సూర్యకుమార్ ను తన బ్యాటింగ్ ప్లేస్ ను మార్చమని అడిగాడు. మూడో స్థానంలో సత్తా చాటుతానంటూ స్కైకి చెప్పడం, దానికి భారత కెప్టెన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీన్ మారిపోయింది.
సూర్యకుమార్ కు చెప్పినట్టుగానే సెంచరీ కొట్టి తన సత్తా రుజువు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాత ఇక తిలక్ వర్మే మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడంటూ సూర్యకుమార్ యాదవ్ అధికారికంగా ప్రకటించేశాడు. ఛాన్స్ వచ్చినప్పుడే చెలరేగిపోవాలన్న మాటలను బలంగా నమ్మిన తిలక్ వర్మ బ్యాటింగ్ కు పలువురు మాజీ ఆటగాళ్ళు సైతం ఫిదా అయ్యారు.
Read Also : Maharashtra Election Campaign : మహారాష్ట్రలో ఇద్దరు తెలుగు సీఎంల ప్రచారం..ఇక తగ్గేదేలే