Tilak Varma టీమిండియాకు ఇది ఒకరకంగా ఊరట కలిగించే వార్తే. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన యువ బ్యాటర్ తిలక్ వర్మ, రాబోయే టీ20 ప్రపంచకప్ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులోకి రానున్నాడు. కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన తిలక్, చివరి రెండు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడని తేలిపోయింది. అయితే, మెగా టోర్నీకి అతను సిద్ధమవడం జట్టు యాజమాన్యానికి పెద్ద ఊరటనిస్తోంది.
- టీ20 వరల్డ్‌కప్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించనున్న యువ బ్యాటర్
- న్యూజిలాండ్‌తో చివరి రెండు టీ20లకు కూడా తిలక్ వర్మ దూరం
- తిలక్ స్థానంలో జట్టులో కొనసాగనున్న శ్రేయస్ అయ్యర్
- ఫిబ్రవరి 3న ముంబైలో భారత జట్టుతో కలవనున్న తిలక్
తాజా నివేదికల ప్రకారం.. 23 ఏళ్ల ఈ హైదరాబాదీ ఆటగాడు ఫిబ్రవరి 3న ముంబైలో భారత జట్టుతో కలవనున్నాడు. ఫిబ్రవరి 4న నవీ ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌కు ముందే అతను జట్టులో చేరతాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కి తిలక్ వర్మ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ వర్గాలు భావిస్తున్నాయి.
తిలక్ గైర్హాజరీతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికైన శ్రేయస్ అయ్యర్‌ను చివరి రెండు మ్యాచ్‌లకు కూడా కొనసాగించే అవకాశాలున్నాయి. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న అయ్యర్, 2025 మెగా వేలంలో రూ.26.75 కోట్లతో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు తిలక్ స్థానంలో నంబర్ 3లో బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. రెండో టీ20లో 32 బంతుల్లో 76 పరుగులు చేసి సత్తా చాటాడు.
ఇప్పటివరకు 40 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ రెండు సెంచరీలు, ఆరు అర్ధశతకాలతో 1,183 పరుగులు సాధించాడు. అతని పునరాగమనం ప్రపంచకప్‌లో భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌కు మరింత బలాన్ని చేకూర్చనుంది.
