Site icon HashtagU Telugu

India Vs Srilanka : రోహిత్ సేన ఓటమికి కారణాలివే

India vs Sri Lanka

India vs Sri Lanka

డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగు పెట్టిన టీమిండియా సూపర్ 4 స్టేజ్ లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. అద్భుతాలు జరిగితే తప్ప టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించినట్టే. అయితే శ్రీలంక జట్టు చేతిలో ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. టాస్ ఓడిపోవడం మొదటి కారణంగా తీసుకుంటే…బ్యాటింగ్ లో మరోసారి అనుకున్న స్కోర్ చేయలేక పోయింది. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు పరుగులు చేయలేక చేతులెత్తేయడం టీమిండియా కొంపముంచింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ 97 పరుగుల భాగస్వామ్యం అందించినా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆ జోరును కొనసాగించలేకపోయారు. హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, దీపక్ హుడా వైఫల్యంతో భారీ స్కోర్ చేసే అవకాశం చేజారింది.దినేశ్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకోకపోవడం కూడా ప్రభావం చూపిందని మాజీలు అభిప్రాయ పడుతున్నారు.

173 రన్స్ ను కాపాడుకోవడంలో బౌలర్లు…అందులోనూ ఆరంభంలోనే వికెట్లు తీయడం చాలా ముఖ్యం. వికెట్లు తీయలేక పోయినా ప్రత్యర్థి బ్యాటర్ల ను కట్టడి చేయాలి. ఈ విషయంలో భారత బౌలర్లు పూర్తిగా నిరాశ పరిచారు. లంక ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే ఎటాకింగ్ బ్యాటింగ్ తో ఆధిపత్యం కనబరిచారు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు తీసినా.. పేసర్లు కనీసం ప్రభావం చూపలేకపోయారు. మ్యాచ్ ఆఖరి ఓవర్‌కు తీసుకెళ్లినా 19వ ఓవర్ లో భువనేశ్వర్ కుమార్ 14 పరుగులు ఇవ్వడం ఓటమికి మరో కారణం. ఇక వికెట్ల వెనుక రిషబ్ పంత్ పేలవ కీపింగ్ భారత్ కొంపముంచింది. శనకను స్టంపౌట్
చేసే అవకాశాన్ని పంత్ చేజార్చుకున్నాడు. అలాగే ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్య వైఫల్యం కూడా భారత్ అవకాశాలను దెబ్బ తీసింది. పాకిస్థాన్‌తో టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపిన హార్దిక్ పాండ్యా.. తరువాతి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. శ్రీలంకతో అటు బ్యాటింగ్.. ఇట బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఇక గాయం కారణంగా ఆల్ రౌండర్ జడేజా దూరమవడం కూడా కారణంగా చెప్పొచ్చు.

Exit mobile version