IPL Umran Malik: అరువు స్పైక్ షూస్ నుంచి ఐపీఎల్ వరకూ… అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉమ్రాన్ మాలిక్

ఐదేళ్ళ క్రితం వరకూ ప్రొఫెషనల్ క్రికెట్‌ అంటే తెలియని ఆటగాడు... ఇప్పుడు ఐపీఎల్‌లో ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - April 14, 2022 / 09:42 PM IST

ఐదేళ్ళ క్రితం వరకూ ప్రొఫెషనల్ క్రికెట్‌ అంటే తెలియని ఆటగాడు… ఇప్పుడు ఐపీఎల్‌లో ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. అరువు తెచ్చుకున్న స్పైక్‌ షూస్‌తో ప్రాక్టీస్‌ చేయడం దగ్గర నుంచి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అవకాశం రావడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం మరింత కష్టం. అయితే 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ జట్టులో కీలకంగా మారిన ఆ బౌలర్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు.

ఉమ్రాన్ మాలిక్… ప్రస్తుతం ఐపీఎల్‌లో ప్రత్యర్థి బ్యాటర్లకు తన వేగంతో నిద్ర లేకుండా చేస్తున్న యువపేసర్. ఐపీఎల్‌ నుంచి ఎంతోమంది యువఆటగాళ్ళు వెలుగులోకి వచ్చారు. గత రెండు సీజన్లుగా ఉమ్రాన్ మాలిక్ కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. ముందు నెట్‌ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ పేసర్ ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో కీబౌలర్‌గా మారిపోయాడు. ఏదో వన్ మ్యాచ్ వండర్‌లా కాకుండా ప్రతీ మ్యాచ్‌లోనూ నిలకడగా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. మ్యాచ్‌ మ్యాచ్‌కూ ఉమ్రాన్ మాలిక్ వేగం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. బుల్లెట్లలా దూసుకెళుతున్న ఈ బంతులను చూసి ప్రత్యర్థి బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. 22 ఏళ్ల ఈ శ్రీనగర్‌ బౌలర్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా అతడి వేగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ కెరీర్ జర్నీ మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. 2017 వరకు ఉమ్రాన్ మాలిక్ కు అసలు ప్రొఫెషనల్ క్రికెట్ గురించి ఏమీ తెలియదు. జమ్మూలో టెన్నిస్ బాల్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువపేసర్‌ స్నేహితుల సలహాతో కోచ్‌ దగ్గర చేరి మరింత రాటుదేలాడు. అప్పటి కోచ్ రణధీర్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా ప్రాక్టీస్ ప్రారంభించాడు.

జమ్మూలో అండర్-19 క్రికెట్ జట్టు కోసం అరువు తెచ్చుకున్న స్పైక్ షూస్ ధరించి ట్రయల్స్‌కు హాజరవడం అతని ప్రొఫెషనల్ కెరీర్‌కు తొలి అడుగు పడినట్టైంది.ఆ తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్ జట్టుకు ఎంపికైన ఉమ్రాన్ మాలిక్‌ కెరీర్‌కు 2019-20 రంజీ ట్రోఫీ సీజన్‌ నిర్వహించిన నెట్ బౌలర్ల ట్రయల్స్‌ టర్నింగ్ పాయింట్‌గా చెప్పొచ్చు. భారత మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా అతని బౌలింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఉమ్రాన్ మాలిక్‌ బౌలింగ్‌ చూసి జమ్మూ సీనియర్ జట్టుకు సిఫార్సు చేశాడు. ఐదేళ్ళ క్రితం నుంచే క్రికెట్ బాల్‌తో ప్రాక్టీస్ చేసిన ఉమ్రాన్ తక్కువ సమయంలోనే నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తుండడం అంత ఈజీ కాదంటున్నారు మాజీలు. ఈసారి సీజన్‌లో అత్యంత వేగంగా బంతులు వేసిన బౌలర్ల జాబితా చూస్తే.. టాప్‌-5లో అన్ని పేర్లూ ఉమ్రాన్‌వే. అందుకే సోషల్ మీడియాలో ఉమ్రాన్‌ పేరు మారు మోగుతోంది. ప్రతీ మ్యాచ్‌లోనూ రికార్డు వేగంతో బౌలింగ్ చేయడం…లక్ష రూపాయల రివార్డ్ అందుకోవడం అతని దినచర్యగా మారిపోయిందంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఉమ్రాన్‌ వేగం.. అతడి వయసు దృష్టిలో పెట్టుకుంటే భారత్‌కు ఓ మంచి పేసర్‌ సిద్ధంగా ఉన్నట్లేనని హర్ష భోగ్లే, రవిశాస్త్రి లాంటి వ్యాఖ్యాతలు అభిప్రాయపడుతున్నారు.