Site icon HashtagU Telugu

MS Dhoni: అట్లుంటది ధోనీతోని.. ఓ రేంజ్‌లో మహి మేనియా

Dhoni As Uncapped Player

Dhoni As Uncapped Player

MS Dhoni: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై టీమ్ మ్యాచ్ జరిగినా స్టేడియం కిక్కిరిసిపోతోంది. హోంటీమ్ కంటే చెన్నై టీమ్ ఫ్లాగ్స్‌, జెర్సీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నేపథ్యంలోనే ఫ్యాన్స్‌ మహి మ్యాజిక్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియాలకు క్యూ కడుతున్నారు. ఐపీఎల్ రిటైర్మెంట్‌ ఇప్పుడే కాదని సాక్షాత్తూ ధోనీనే చెప్పినా దీనిపై చర్చ ఆగడం లేదు.

మహేంద్రసింగ్ ధోనీ… ఆ పేరు వింటే చాలు క్రికెట్ ఫ్యాన్స్‌కు పూనకాలే… మహి క్రీజులోకి వస్తున్నాడంటే స్టేడియం దద్దరిల్లాల్సిందే.. అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్రుడు వీడ్కోలు పలికిన తర్వాత ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. దీంతో మిస్టర్ కూల్‌ బ్యాటింగ్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. పైగా గత రెండేళ్ళుగా సొంతగడ్డపై మ్యాచ్‌లు జరగకపోవంతో ఈ సారి ఐపీఎల్‌కు ఫ్యాన్స్‌ క్యూ కట్టారు. ముఖ్యంగా చెన్నై సూపర్‌కింగ్స్ ఎక్కడ ఆడుతున్నా స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయి. హోంటీమ్ కంటే చెన్నై ఫ్లాగ్స్, జెర్సీలో స్టేడియంలో ఎక్కువగా కనిపిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో ఫ్యాన్స్‌ చెన్నై మ్యాచ్‌లకు రావడానికి ప్రత్యకంగా కారణముంది. ఈ సీజన్‌తో ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగియబోతోందని వార్తలు వస్తున్నాయి. రిటైర్ కావడం లేదని సాక్షాత్తూ ధోనీనే క్లారిటీ ఇచ్చినా దానిపై చర్చ ఆగడం లేదు. అందుకే మహేంద్రుడి మ్యాజిక్‌ను చూసేందుకు స్టేడియాలకు క్యూ కడుతున్నారు.

అటు కెప్టెన్‌గానూ, ఇటు బ్యాటర్‌గానూ మహి మ్యాజిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిటైర్‌మెంట్ వార్తల నేపథ్యంలో ధోనీని చివరిసారి గ్రౌండ్‌లో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్‌తో స్టేడియాలు దద్దరిల్లిపోతున్నాయి. ధోనీ కంటే ముందు బ్యాటర్లు త్వరగా ఔట్ అయిపోవాలని వారు కోరుకుంటున్నారంటే మహి బ్యాటింగ్ చూసేందుకు వారు ఎంతగా ఎదురుచూస్తున్నారనేది అర్థమవుతోంది. ఈ విషయాన్ని చెన్నై ప్లేయర్ రవీంద్ర జడేజా కూడా చెప్పాడు. ఏడో స్థానంలో తాను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్టేడియంలో అందరూ ధోనీ..ధోనీ అంటూ అరుస్తున్నారని, తాను త్వరగా ఔట్ అవ్వాలని కూడా వారు కోరుకుంటున్నారని సరదాగా వ్యాఖ్యానించాడు. జడేజా సరదాగా చెప్పినా చాలా మంది ఫ్యాన్స్ మనసులో మాత్రం ఇదే ఉంది. అయితే ధోనీ ఈ సీజన్‌తో రిటైర్ కావడం లేదనేది మాత్రం వాస్తవం. ఇప్పటికే ఈ విషయంపై ధోనీతో పాటు ఆ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌, కోచ్‌ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల రైనా కూడా ధోనీతో తాను మాట్లాడానని, మళ్ళీ ట్రోఫీ గెలిచి మరో సీజన్ ఆడతానన్న విషయాన్ని ధోనీ చెప్పాడని వెల్లడించాడు.

మరోవైపు ధోనీ ఆడుతున్నంత సేపూ అటు టీవీ రేటింగ్స్ , ఇటు జియో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వ్యూయర్‌షిప్‌ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అప్పటి వరకూ లక్షల్లో ఉన్న వ్యూయర్స్ రెట్టింపు సంఖ్య కోటి వ్యూయర్స్ దాటిపోతున్నాయి. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ రెండు, మూడు భారీ సిక్సర్లు కొట్టి అభిమానులను అలరిస్తున్నాడు. నిజానికి ధోనీ కొంచెం ముందే వస్తే బావుంటుందన్న అభిప్రాయం వినిపిస్తున్నా.. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యువ క్రికెటర్లకు అవకాశాలిస్తున్నాడు మహేంద్రుడు. ఏదైతేనేం ధోనీ రిటైర్మెంట్‌ అంటూ జరుగుతున్న చర్చతో మ్యాచ్‌లన్నీ కిక్కిరిసిన అభిమానుల మధ్య జరుగుతుండడం అందరికీ ఉత్సాహాన్నిస్తోంది.

Read More: IPL 2023: ఆర్సీబీ బాటలో గుజరాత్ టైటాన్స్… సన్ రైజర్స్ తో మ్యాచ్ కు స్పెషల్ జెర్సీ