జకోవిచ్ వ్యాక్సిన్ ప్రూఫ్ చూపించాల్సిందే..తేల్చి చెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని

(Photo Courtesy : AFP via Getty Images) ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ కు ముందు వివాదం చెలరేగింది. వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ కు నిర్వాహకులు వ్యాక్సిన్ మినహయింపు ఇవ్వడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

  • Written By:
  • Updated On - January 5, 2022 / 09:14 PM IST

ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ కు ముందు వివాదం చెలరేగింది. వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ కు నిర్వాహకులు వ్యాక్సిన్ మినహయింపు ఇవ్వడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు టెన్నిస్ టోర్నీల్లో ఆడే క్రీడాకారులు తప్పనిసరిగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండాలి. లేకుంటే టోర్నీలు ఆడేందుకు అనుమతి ఇవ్వరు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు కూడా ఇదే రూల్ పాటిస్తున్నారు. టీకా రెండు డోసులు తీసుకున్న వారికే టోర్నీలో ఆడేందుకు అనుమతి ఇచ్చారు. ప్రతీ ప్లేయర్ టీకా తీసుకున్న ప్రూఫ్ నిర్వాహకులకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే వరల్డ్ నెంబర్ వన్ జకోవిచ్ కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. జకోవిచ్ ఇప్పటి వరకూ కోవిడ్ వ్యాక్సిన్ ఒక్క డోసు కూడా తీసుకోలేదు. మొదట నుండీ టీకా తీసుకునేందుకు జకో నిరాకరిస్తున్నాడు. దీంతో ప్రత్యక వైద్య మినహాయింపుతో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చాడు. నిర్వాహకులు అతనికి హామీ ఇవ్వడంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్నట్టు ప్రకటించాడు.

అయితే జకోవిచ్ కు మినహాయింపు ఇవ్వడంపై మాజీ ఆటగాళ్ళు, పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. నిబంధనలు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జకోవిచ్ వ్యాక్సిన్ మినహాయింపు వివాదం చర్చనీయాంశంగా మారడంతో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ స్పందించారు. నిర్వాహకుల తీరును తప్పుపడుతూ జకోవిచ్ కూడా వ్యాక్సీన్ ప్రూఫ్ సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకుంటే జకోను స్వదేశం తిరిగి పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోవిడ్ నిబంధనల విషయంలో ఎవ్వరికీ మినహాయింపులు ఇవ్వలేమని తేల్చి చెప్పారు.దీనిపై ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు , జకోవిచ్ ఇప్పటి వరకూ స్పందించలేదు. కాగా కరోనా టీకా తీసుకోకపోవడానికి గల కారణాలు మాత్రం జకోవిచ్ వెల్లడించలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 17 నుండి ప్రారంభం కానుంది.