Site icon HashtagU Telugu

IND vs SA 2022 : సఫారీలు వచ్చేశారు

Temba Bavuma

Temba Bavuma

ఐదు టీ ట్వంటీల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. ఐపీఎల్ ముగియడంతో భారత ప్లేయర్స్ అంతా విశ్రాంతి తీసుకుంటుండగా… బవుమా సారథ్యంలోని సఫారీ జట్టు ఢిల్లీకి చేరుకుంది. భారీ భద్రత మధ్య ఎయిర్‌పోర్టు నుంచి సఫారీ క్రికెటర్లను హోటల్‌కు తరలించారు. ఆటగాళ్ళందరూ పూర్తి కోవిడ్ జాగ్రత్తలతో ఇక్కడకు రాగా వీరందరికీ మళ్ళీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే భారత్ , సౌతాఫ్రికా టీ ట్వంటీ సిరీస్‌ బయోబబూల్ లేకుండానే జరగబోతోంది. దాదాపు రెండేళ్ళుగా క్రికెట్ సిరీస్‌లు అన్నీ కోవిడ్ కారణంగా బయోసెక్యూర్ బబూల్‌లోనే నిర్వహిస్తున్నారు. ఏ ఆటగాడూ హోటల్, స్టేడియం దాటి బయటకు వెళ్ళకుండా ఆంక్షలు విధించారు. అయితే కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సఫారీతో సిరీస్‌కు బీసీసీఐ ఎటువంటి ఆంక్షలు విధించలేదు. బబూల్ లేకున్నా ఆటగాళ్ళు స్వీయజాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఐపీఎల్ ఆడిన డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, కగిసో రబాడ ఇక్కడే ఉండడంతో నేరుగా తమ జట్టుతో కలిసారు. శుక్రవారం నుంచి సౌతాఫ్రికా క్రికెట్ జట్టు తమ ప్రాక్టీస్ ఆరంభించనుంది. ఐపీఎల్‌లో డికాక్ , మిల్లర్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ విజయంలో మిల్లర్ కీలకపాత్ర పోషించడంతో ఈ సిరీస్‌లో కూడా అతనిపై భారీ అంచనాలున్నాయి. కాగా టీ ట్వంటీ ప్రపంచకప్ ముంగిట సిరీస్ కావడంతో సౌతాఫ్రికా పూర్తి స్థాయి జట్టుతో భారత పర్యటనకు వచ్చింది. ఐదు టీ ట్వంటీల సిరీస్ జూన్ 9 నుంచి ఆరంభం కానుంది. తొలి టీ ట్వంటీ ఢిల్లీలోనూ, రెండో మ్యాచ్ కటక్‌లోనూ, మూడో టీ ట్వంటీ విశాఖలోనూ జరగనుండగా… నాలుగో మ్యాచ్‌కు రాజ్‌కోట్, ఐదో మ్యాచ్‌కు బెంగళూరు ఆతిథ్యమివ్వనున్నాయి.

Exit mobile version