Site icon HashtagU Telugu

World Chess Championship: ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించిన తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్‌

World Chess Championship

World Chess Championship

World Chess Championship: భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు. చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌ను తుది పోరులో ఓడించి, ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన అత్యంత తక్కువ వయసు గల ఆటగాడిగా నిలిచాడు. 18 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించి, చెస్‌ ప్రపంచంలో ఓ కొత్త అధ్యాయాన్ని తన పేరిట రాశాడు. ఈ టైటిల్‌ను సాధించిన తర్వాత గుకేశ్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, ఆనందంతో కన్నీళ్లను పెట్టుకున్నాడు.

టైటిల్ సాధించిన తర్వాత గుకేశ్‌ తన అనుభవాన్ని పంచుకున్నారు. “ఈ క్షణం కోసం నేను దశాబ్ద కాలంగా ఎదురు చూసాను,” అని చెప్పారు. “పదేళ్ల తర్వాత ఆ కల నెరవేరినందుకు చాల సంతోషంగా ఉంది.ఈ విజయాన్ని ఊహించలేదని, అందుకే కాస్త భావోద్వేగానికి లోనయ్యానని ఆయన తన మనసులోని మాటలు వెల్లడించారు.

దొమ్మరాజు గుకేశ్‌ మాట్లాడుతూ:

“ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలవాలనే కల నాకు చిన్నప్పటినుండి ఉంది. కానీ, నాకు కంటే నా తల్లిదండ్రులకే నేను ఛాంపియన్‌గా నిలవాలని కోరిక ఉంది. నా విజయంలో వారి ప్రోత్సాహం అన్నిటికన్నా గొప్పది,” అని గుకేశ్‌ చెప్పాడు. “డింగ్‌ లిరెన్‌ (తుది పోరులో ప్రత్యర్థి) నిజమైన ప్రపంచ ఛాంపియన్‌. అతని ఓటమి నాకు బాధ కలిగించింది. అయినప్పటికీ, అతనికి, అతని బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.”

“నేను ఈ విజయాన్ని ఊహించలేదు, కానీ అవకాశం రాగానే దానిపై ప్రయత్నించా. నా పదేళ్ల కల నెరవేరింది,” అని గుకేశ్‌ అన్నారు.

“ఈ క్షణం కోసం నేను పదేళ్లుగా కలలు కనేవాడిని. ఊహించని విజయంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఈ టైటిల్‌ గెలిచినంత మాత్రాన నేను ఉత్తమ ప్లేయర్‌ కాదు. ఉత్తమ ప్లేయర్ మాగ్నస్‌ కార్ల్‌సనే,” అని గుకేశ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు:

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ సాధించిన గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు అనేక ప్రముఖులు అతడికి శుభాకాంక్షలు తెలిపారు.