Site icon HashtagU Telugu

Team India Trouble:మొన్న లగేజ్ రాలే… ఇప్పుడు వీసా రాలే

Team India New Feb 2

Team India New Feb 2

కరేబియన్ టూర్‌లో భారత క్రికెట్ జట్టును ఆఫ్ ది ఫీల్డ్ సమస్యలు వెంటాడుతున్నాయి. మొన్న ఆటగాళ్ళ లగేజ్ రాకపోవడంతో రెండు మ్యాచ్‌లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు చివరి రెండు టీ ట్వంటీలకు వీసా సమస్యలు వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరగాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ వీసాలు రాలేదని తెలుస్తోంది. దీంతో విండీస్ బోర్డు ఆందోళన చెందుతోంది.

అమెరికా వెళ్లేందుకు ఇరుజట్లలోని ఆటగాళ్లకు వీసాలు రాకపోవడంతో మ్యాచ్‌ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన విండీస్‌ క్రికెట్‌ బోర్డు వీసా ఎంట్రీకి సంబంధించిన కార్యచరణను పూర్తి చేయాల్సి వచ్చింది. తమ ఎంబసీ అధికారులతో మాట్లాడినప్పటకీ ఇరు జట్ల ఆటగాళ్ళ వీసాలు జారీ కాలేదని సమాచారం. ముందుగా ఇరుజట్ల ఆటగాళ్లు గయానాలోని జార్జిటౌన్‌కు చేరుకోనున్నారు. గయానాలోని అమెరికా ఎంబసీలో ఆటగాళ్లకు వీసా అపాయింట్‌మెంట్స్‌ బుక్‌ చేశారు. అన్ని సక్రమంగా జరిగితే గురువారం సాయంత్రం వరకు ఆటగాళ్లు ప్లోరిడాలోని మయామికి చేరుకుంటారని విండీస్ బోర్డు అధికారి తెలిపారు. ఆటగాళ్లకు వీసా సమస్య తీరిపోయినట్లేనని భావిస్తున్నానమని, ముందు గయానాకు వెళ్లనున్న ఆటగాళ్లు అక్కడి నుంచి ఫ్లోరిడాకు చేరుకుంటారని వెల్లడించారు. అమెరికాలో క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచే ఉద్ధేశంతో విండీస్ బోర్డు పలు సిరీస్‌లలో మ్యాచ్‌లను ఫ్లోరిడాలో నిర్వహిస్తోంది. అయితే భారత్‌ లాంటి పెద్ద జట్టుతో సిరీస్ సమయంలో ఇలా వీసా సమస్య రావడంతో ఇక భవిష్యత్తులో అక్కడ మ్యాచ్‌లు ఏర్పాటు చేసేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.

కాగా రెండో టీ ట్వంటీకి ముందు టీమిండియా ఆటగాళ్లకు లగేజీ సమస్య ఎదురైంది. ట్రినిడాడ్‌ నుంచి సెయింట్‌ కింట్స్‌కు లగేజీ రాక ఆలస్యం కావడంతో మ్యాచ్‌ దాదాపు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆటగాళ్ల లగేజీ సమస్యపై విండీస్‌ క్రికెట్‌ బోర్డు క్షమాపణ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాతి మ్యాచ్‌కు ముందు ఆటగాళ్ళకు తగినంత విశ్రాంతి లేకపోవడంతో గంటన్నర ఆలస్యంగా మూడో మ్యాచ్‌ ఆరంభమైంది. అయితే విండీస్ బోర్డు నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఇలాంటి సమస్యలు రావడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడో మ్యాచ్‌లో గెలిచిన భారత్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మూడో మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్‌శర్మ గాయపడడంతో మిగిలిన సిరీస్‌కు అతను అందుబాటులో ఉండడంపై సందిగ్థత నెలకొంది. ఒకవేళ రోహిత్ దూరమైతే పంత్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.