Site icon HashtagU Telugu

RCB: ఆర్సీబీతో జాగ్రత్త…ఇర్ఫాన్ పఠాన్ వార్నింగ్

RCB

RCB

ఐపీఎల్ 15వ సీజన్‌లో అదృష్టం కలిసొచ్చి ప్లేఆఫ్స్‌కు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు టైటిల్‌పై కన్నేసింది. బెంగళూరుతో మిగిలిన జట్లు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఆర్సీబీని లైట్‌గా తీసుకోకూడదని, తనదైన రోజున ఎంత పెద్ద జట్టునైనా ఓడించి తీరుతుందని అంటున్నారు. ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు.ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా మూడో సారి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుందనీ, ఈ కారణంగా మిగిలిన జట్లు ఆర్సీబీని చూసి భయపడుతున్నాయని వ్యాఖ్యానించాడు.

గుజరాత్‍‌‌తో జరిగిన గత మ్యాచ్‌లో అత్యద్భుతంగా పుంజుకుని విజయాన్ని అందుకుందనీ గుర్తు చేశాడు. విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశమన్న పఠాన్ గత మ్యాచ్‌లో అద్భుత అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పాడు. అంతేకాకుండా మిగిలిన ఆటగాళ్లు కాకుండా తమ వంతు భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నారనీ విశ్లేషించాడు. ప్రస్తుత పరిస్థతుల్లో ఏ జట్టు కూడా ఆర్సీబీని సులభంగా తీసుకోకూడదనీ పఠాన్ హెచ్చరించాడు. ఎలిమినేటర్ పోరులో లక్నో ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా ఇంటిదారి పట్టల్సిందేనని అభిప్రాయ పడ్డాడు.

ప్లేఆఫ్స్ చేరిన నాలుగు జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచింది. బుధవారం నాడు ఈ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సాయంత్రం 07.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.
ఈ మ్యాచ్ లో ఓడిన రాజస్థాన్ రెండో క్వాలిఫైయర్ లో బెంగుళూరు, లక్నో మధ్య విజేతతో తలపడుతుంది.