Team India: హైదరాబాద్‌లో టీ ట్వంటీ మ్యాచ్… ఎప్పుడో తెలుసా ?

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా బిజీ షెడ్యూల్ ఉక్కిరిబిక్కిరి కానుంది.

  • Written By:
  • Publish Date - August 4, 2022 / 09:18 PM IST

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా బిజీ షెడ్యూల్ ఉక్కిరిబిక్కిరి కానుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్ ముగించుకుని విండీస్‌ టూర్‌లో పర్యటిస్తున్న భారత్ జింబాబ్వే పర్యటన తర్వాత ఆసియా కప్ ఆడనుంది. అనంతరం స్వదేశంలో పలు సిరీస్‌లతో బిజీబిజీగా గడపనుంది.

ఆసియా కప్‌ ముగిసిన తర్వాత టీమిండియా దాదాపు నెలన్నర ఖాళీగా ఉండటంతో బీసీసీఐ ఈ మధ్యలో రెండు సిరీస్‌లను ప్లాన్‌ చేసింది. సెప్టెంబర్‌ 20-25 మధ్యలో ఆస్ట్రేలియా, సెప్టెంబర్‌ 28-అక్టోబర్‌ 11 మధ్యలో సౌతాఫ్రికా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. భారత పర్యటనలో ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్‌ ఆడనుండగా.. దక్షిణాఫ్రికా 3 టీ ట్వంటీలు, 3 వన్డేలు ఆడనుంది.

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు మొహాలీ, నాగ్‌పూర్, హైదరాబాద్ ఆతిథ్యమివ్వనున్నాయి. తొలి టీ ట్వంటీ సెప్టెంబర్ 20న మొహాలీలోనూ, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 23న నాగ్‌పూర్‌లోనూ జరగనుంది. ఇక ఆస్ట్రేలియాతో మూడో టీ ట్వంటీకి హైదరాబాద్ వేదిక కానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం చివరరి సారిగా 2019 డిసెంబర్‌లో అంతర్జాతీయ టీ ట్వంటీకి ఆతిథ్యమిచ్చింది.

ఇప్పుడు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌ ఇక్కడ జరగనుండడంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సౌతాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్‌కు తిరువనంతపురం, గౌహతి, ఇండోర్వే దికలుగానిర్ణయించారు.  అటు వన్డే సిరీస్‌కు లక్నో, రాంఛీ, ఢిల్లీ ఆతిథ్యమివ్వనున్నాయి. సెప్టెంబర్ 28న తొలి టీ ట్వంటీ తిరువనంతపురంలోనూ, అక్టోబర్ 2న రెండో మ్యాచ్ గౌహతీలోనూ, మూడో టీ ట్వంటీ అక్టోబర్ 4న ఇండోర్‌లోనూ జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 6న లక్నోలో తొలి వన్డే, అక్టోబర్ 9న రెండో వన్డే రాంఛీలోనూ జరగనుండగా… అక్టోబర్ 11న మూడో వన్డేకు ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది.
టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు ఇదే చివరి సిరీస్‌. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 22 నుంచి టీ ట్వంటీ ప్రపంచకప్ ఆరంభం కానుంది.