Site icon HashtagU Telugu

T20 World Cup 2022: టీమిండియా రోడ్ టు సెమీస్

T20 World Cup Squad

T20 World Cup

T20 World Cup 2022: టీ ట్వంటీ ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఇప్పుడు టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచీ నిలకడగా ఆడుతున్న భారత్‌కు మధ్యలో సఫారీలు షాకిచ్చినా..నాలుగు విజయాలతో సూపర్ 12 స్టేజ్‌ను టాప్ ప్లేస్‌లో ముగించింది. సెమీస్ వరకూ భారత జర్నీని ఒక్కసారి చూద్దాం…

వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఛాంపియన్‌గా నిలవాలంటే ఆరంభం అదిరిపోవాలి. సూపర్ 12 స్టేజ్ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై ఇదే తరహా ఆరంభం టీమిండియాకు దక్కింది. గత ఎడిషన్‌లో ఓటమికి రివేంజ్ తీర్చుకుంటూ పాక్‌పై రోహిత్‌సేన అదరగొట్టింది. చివరి బంతి వరకూ ఉత్కంఠతో ఊపేసిన ఈ పోరు క్రికెట్ ఫ్యాన్స్‌కు సూపర్ కిక్ ఇచ్చింది. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ మెరుపులతో పాక్‌ను ఓడించి టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది.
పాక్‌పై విన్నింగ్ జోష్‌ను నెదర్లాండ్స్‌పైనా కంటిన్యూ చేసిన టీమిండియా 56 పరుగులతో విజయాన్ని అందుకుంది.

మరోసారి సూర్యకుమార్, కోహ్లీ మెరుపులు ఫ్యాన్స్‌ను అలరించాయి. అయితే వరుసగా రెండు విజయాల తర్వాత సౌతాఫ్రికా చేతిలో షాక్ తగిలింది. ఊహించని విధంగా బ్యాటర్లు విఫలమవడం, పేలవ ఫీల్డింగ్‌తో పరాజయం పాలైంది. సఫారీ పేస్ ఎటాక్‌ను ఎదుర్కోవడంలో మన బ్యాటర్లు తడబడ్డారు. అటు కీలక సమయంలో క్యాచ్‌లు , రనౌట్లు జారవిడవడం కూడా ఓటమికి కారణమైంది. ఇదిలా ఉంటే వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించడం ద్వారా రోహిత్ సేన మళ్ళీ పుంజుకుంది. ఒక దశలో వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లా విజయం సాధించేలా ఉండడం టెన్షన్ పెట్టినా… మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యాక భారత బౌలర్లు పుంజుకుని బంగ్లా జోరుకు బ్రేక్ వేశారు.

బంగ్లాపై విజయంతో దాదాపు సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న భారత్ చివరి మ్యాచ్‌లో జింజాబ్వేతో తలపడింది. ఈ మ్యాచ్ ఫలితం కంటే ముందే సౌతాఫ్రికా ఓటమితో సెమీస్ చేరిన టీమిండియా జింబాబ్వే గెలిచి గ్రూప్‌ను టాప్ ప్లేస్‌తో ముగించింది. టైటిల్ వేటలో సెమీస్ వరకూ టీమిండియా అంచనాలకు తగ్గట్టే ఆడింది. స్టార్ పేసర్ బూమ్రా దూరమైనప్పటకీ..మిగిలిన పేసర్లు నిలకడగా రాణించడం, కోహ్లీ, సూర్యకుమార్ ఫామ్‌ జట్టును విజయాల బాటలో నడిపించాయి. ఇదే జోష్‌లో మరో రెండడుగులు వేస్తే 15 ఏళ్ళ తర్వాత మరోసారి టీ ట్వంటీ ప్రపంచకప్ భారత్ సొంతమవుతుంది