T20 World Cup 2022: టీమిండియా ఈసారి హిస్టరీ రిపీట్ చేస్తుందా..?

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ రానే వచ్చింది. కంగారుల గడ్డపై మనోళ్లు సత్తాచాటి మరో ట్రోఫీని తెచ్చే టైం వచ్చిందని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 17, 2022 / 02:47 PM IST

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ రానే వచ్చింది. కంగారుల గడ్డపై మనోళ్లు సత్తాచాటి మరో ట్రోఫీని తెచ్చే టైం వచ్చిందని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణకు మనోళ్లు చెక్ పెడతారని అనుకుంటున్నారు. కాబట్టీ ఈ టోర్నీ మనకు చాలా స్పెషల్.. కాదు డబుల్ స్పెషల్. ఎందుకుంటే 1983 ప్రపంచకప్ టోర్నీతోనే మన భారత్ ఐసీసీ టోర్నీలలో విజయాలకు ఖాతా తెరిచింది.

1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో టీమిండియా ప్రపంచకప్ కొట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ తర్వాత టోర్నీలలో ఎంతమంది దిగ్గజాలు ఉన్నా మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. గంగూలీ కెప్టెన్సీలో 2002లో ఛాంపియన్స్ ట్రోఫీకి చేరువైనా వరుణుడు కనికరించకపోవడంతో కప్పును శ్రీలంకతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అది మనోళ్లకు అంతగా తృప్తిని ఇవ్వలేదు. ఆ తర్వాత 2003 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా మనల్ని దురదృష్టం వెంటాడింది. 2003 ప్రపంచకప్ లో ఫైనల్ వరకు వెళ్లామనే జోష్, ఈసారి ఎలాగైన కప్పు కొట్టాలన్న కసితో మన ఆటగాళ్లు 2007 ప్రపంచకప్ బరిలోకి దిగినా.. అక్కడ సీన్ రివర్స్ అయింది. అసలు గ్రూప్ స్టేజ్ నుంచే గట్టెక్కలేకపోయారు. ఇక టీమిండియా పని సరి అని అనుకున్నారు అంతా. కరెక్ట్ గా అదే సంవత్సరం సెప్టెంబర్ లో తొలి టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఫిక్స్ చేసింది ఐసీసీ.

మెగా టోర్నీ ఓడిపోయామని సీనియర్లు నిరాశలో ఉండటం, ఫ్యాన్స్ లో కూడా టీ20 వరల్డ్ కప్ అంచనాలు లేకపోవడంతో ఏ ఒక్కరికి 30 ఏళ్ళు నిండని యువ టీంను సఫారీ గడ్డపైకి పంపింది బీసీసీఐ. అంచనాలు లేకుండా బరిలోకి దిగ్గిన టీమిండియా తొలి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత వరసగా 2011 వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలను గెలిచింది. 2013 తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా టీమిండియా గెలవలేదు.

రన్ మెషీన్ గా పేర్కొనే విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి రావడం, దినేశ్ కార్తీక్, సూర్యకుమార్ యాదవ్ టాప్ ఫామ్ లో ఉండటం మన జట్టుకు ప్లస్. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత స్ట్రాంగ్ గా టీమిండియా మిడిల్ ఆర్డర్ ఉంది. అందులోనూ బౌండరీలతో రెచ్చిపోయే సూర్యకుమార్ పైన భారీ అంచనాలే ఉన్నాయ్. సమస్యంతా ఓపెనర్లు, బౌలింగ్ తోనే.

కెప్టెన్సీ చేపట్టాక రోహిత్ శర్మలో మునపటి జోరు తగ్గింది. ఎప్పుడో ఓసారి తప్ప.. ఇటీవల మ్యాచ్ రోహిత్ తన స్థాయికి తగ్గ ఓపెనింగ్ చేయలేకపోతున్నాడు. రాహుల్ ఫామ్ లోనే ఉన్నా టీ20కి తగినట్టు ధాటిగా ఆడలేకపోతున్నాడు. ఇక బౌలర్లలో ఒకప్పుడు స్పెషలిస్ట్ అయిన భువీ ఇప్పుడు భారీగా రన్స్ ఇస్తున్నాడు. అర్షదీప్, హర్షల్ పటేల్ కూడా కొన్నిసార్లు ఒత్తిడిని తట్టుకొని బౌలింగ్ వేయలేకపోతున్నారు. స్టాండ్ బైలో ఉన్న షమీ జట్టుకు కీలకం కానున్నారు. మరి ఈ సవాళ్లను జట్టు అధిగమిస్తుందా? లేక బూమ్రా, జడేజాలు లేని లోటు కనిపిస్తుందేమో చుడాలిసిందే.