world cup 2023: సమిష్టి కృషితో టీమిండియా జైత్రయాత్ర

టైటిల్ ఫేవరెట్... అందులోనూ సొంతగడ్డపై మెగా టోర్నీ... అంచనాలకు తగ్గట్టే ఉండే ఒత్తిడి గురించి చెప్పక్కర్లేదు...అయితే భారీ అంచనాలతో వచ్చే ఒత్తిడి భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.

world cup 2023: టైటిల్ ఫేవరెట్… అందులోనూ సొంతగడ్డపై మెగా టోర్నీ… అంచనాలకు తగ్గట్టే ఉండే ఒత్తిడి గురించి చెప్పక్కర్లేదు…అయితే భారీ అంచనాలతో వచ్చే ఒత్తిడి భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ప్రతీ మ్యాచ్‌నూ గెలుస్తూ ఏడు విజయాలతో దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ జైత్రయాత్రలో బ్యాటర్ల పాత్ర ఎంతుందో బౌలర్లదీ అంతే ఉంది…ఓవరాల్‌గా సమిష్టికృషి ఫలితమే ఈ వరుస విజయాలకు కారణం..

క్రికెట్ లాంటి టీమ్ ఈవెంట్‌లో ఏ ఒక్కరో రాణిస్తే విజయాలు రావు… సమిష్టిగా సత్తా చాటాల్సిందే…ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు సమిష్టిగా రాణిస్తూ దుమ్మురేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఏడు విజయాలతో టైటిల్ రేసులో దూసుకుపోతోంది. శ్రీలంకపై 302 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మెగా టోర్నీఆరంభానికి ముందే టైటిల్ ఫేవరెట్స్‌లో రోహిత్ సేన అన్ని జట్ల కంటే ముందుంది. భారీ అంచనాల మధ్య టైటిల్ వేటను ఆరంభించిన టీమిండియాకు ఇప్పటి వరకూ అపజయమే లేదు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌నూ చిత్తు చేసింది. నిజం చెప్పాలంటే ఏ మ్యాచ్‌లోనూ భారత్‌కు అసలు పోటీనే ఎదురుకాలేదు. అన్నింటికీ మించి కీలక ఆటగాళ్లు సూపర్ ఫామ్ కొనసాగించడం ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్.

బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, కోహ్లీ, కెఎల్ రాహుల్ తమపై అంచనాలు నిలబెట్టుకుంటున్నారు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కొక్కరు , కొన్ని మ్యాచ్‌లలో ఇద్దరూ ఇలా బాధ్యతను తీసుకుంటూ జట్టుకు భారీస్కోర్లు అందించారు. బ్యాటర్ల ఫామ్‌ ఫలితంగానే ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లలో 5 విజయాలు ఛేజింగ్‌లో వచ్చినవే. ఇదిలా ఉంటే భారత బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. పేసర్లు, స్పిన్నర్లు పోటాపోటీగా వికెట్లు తీస్తున్నారు. మన పేస్ త్రయం బూమ్రా , షమీ, సిరాజ్‌ ను చూసి ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుడుతోంది. ముఖ్యంగా షమీ పేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తున్న షమీ వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 14 ప్రపంచకప్ మ్యాచ్‌లలో 45 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచకప్ ఆరంభంలో నాలుగు మ్యాచ్‌లకు తుది జట్టులోనే చోటు దక్కలేదు. తర్వాత మూడు మ్యాచ్‌లలో అవకాశం రావడంతో మొత్తం 14 వికెట్లతో చెలరేగిపోయాడు. బూమ్రా, సిరాజ్ కూడా రాణిస్తుండడంతో పేస్ ఎటాక్‌కు తిరుగే లేకుండా పోయింది.

ఇక స్పిన్నర్లు జడేజా, కుల్‌దీప్‌యాదవ్ తమ మణికట్టు మ్యాజిక్ చూపిస్తున్నారు. జడేజా వికెట్లు తీయడంతో పాటు ఎకానమీ, ఫీల్డింగ్ పరంగానూ తనదైన ముద్ర వేస్తుండగా.. కుల్‌దీప్ యాదవ్‌ కూడా అదరగొడుతున్నాడు. ఈ సారి మెగా టోర్నీలో భారత టీమ్ కాంబినేషన్‌ అద్భుతంగా కుదరడమే వరుస విజయాలకు కారణం. అలాగే ఏ ఒకరో ఇద్దరిపైనో ఆధారపడకుండా సమిష్టిగా రాణిస్తూ వరుస విజయాలు సాధిస్తుండడం జట్టు కాన్ఫిడెన్స్ పెంచింది. ఇక ప్రపంచకప్‌ గెలిచేందుకు రెండు అడుగుల దూరంలో మాత్రమే నిలిచిన రోహిత్‌సేన 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Telangana: బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి: నిర్మల్ సభలో కేసీఆర్