T20 Standby Players: వరల్డ్ కప్ టీమ్ వెంటే స్టాండ్ బై ప్లేయర్స్

టీ ట్వంటీ వరల్డ్ కప్ కు అన్ని జట్లూ సన్నాహాలు మొదలుపెట్టేశాయి. ద్వైపాక్షిక సిరీస్ లతో తమ తుది జట్ల కూర్పును పరిశీలించుకుంటున్నాయి.

  • Written By:
  • Updated On - September 17, 2022 / 10:43 PM IST

టీ ట్వంటీ వరల్డ్ కప్ కు అన్ని జట్లూ సన్నాహాలు మొదలుపెట్టేశాయి. ద్వైపాక్షిక సిరీస్ లతో తమ తుది జట్ల కూర్పును పరిశీలించుకుంటున్నాయి. ప్రస్తుతం భారత్ కూడా ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడబోతోంది. కాగా టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో స్టాండ్ బై ప్లేయర్స్ కూడా ఉన్నారు. వీరందరినీ జట్టుతో పాటే పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం 15 మంది సభ్యులతో కూడిన జట్టుతోనే స్టాండ్ బై ప్లేయర్స్ కూడా ట్రావెల్ చేస్తారు.

నిజానికి ఐసీసీ నిబంధనల ప్రకారం వరల్డ్ కప్ లో 15 మంది ప్లేయర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒకవేళ ఏ ఆటగాడైనా గాయపడితే అతని స్థానంలో రీ ప్లేస్ మెంట్ గా ఐసీసీ అనుమతితో మరో ప్లేయర్ ను తీసుకోవచ్చు. అయితే ముందు జాగ్రత్తగా జట్టుతో పాటు అదనంగా నలుగురు ప్లేయర్లను బీసీసీఐ పంపిస్తోంది. వీరి ప్రయాణ, వసతి ఖర్చులు బీసీసీఐనే భరించాల్సి ఉంటుంది. నిజానికి ఆటగాడు గాయపడినప్పుడు స్వదేశం నుంచి రీ ప్లేస్ మెంట్ ప్లేయర్స్ ను పంపిస్తారు. అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఈ సారి ముందు జాగ్రత్తగా పలు జట్లు ముందే పంపిస్తున్నాయి.

బీసీసీఐ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతోంది. దీంతో స్టాండ్ బై ప్లేయర్స్ గా ఎంపికైవ మహ్మద్ షమీ, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, శ్రేయాస్ అయ్యర్ జట్టుతో పాటే ఆస్ట్రేలియాకు వెళ్ళనున్నారు. గతంలో ఆసీస్ టూర్ జరిగినప్పుడు పలువురు పేస్ బౌలర్లు గాయపడగా.. బీసీసీఐ నెట్ బౌలర్స్ ను ప్రధాన జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో మెగా టోర్నీలో అటువంటి పరిస్థితి రాకుండా ముందే స్టాండ్ బై ప్లేయర్స్ ను పంపిస్తోంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన వెంటనే అక్టోబర్ 6న భారత జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది.