Team India: ఓవల్ లో ఈ సారైనా పట్టేస్తారా..? WTC ఫైనల్ కు భారత్ రెడీ..!

ఓవల్ వేదికగా బుధవారం నుంచి ఆరంభం కానున్న భారత్ (Team India), ఆస్ట్రేలియా (Australia) WTC ఫైనల్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 6, 2023 / 11:11 AM IST

Team India: వరల్డ్ క్రికెట్‌లో రెండు బెస్ట్ టీమ్స్‌.. అందులోనూ టెస్ట్ ఫార్మాట్‌… పైగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌.. క్రికెట్ అభిమానులకు ఇంతకంటే మజాను ఇచ్చే మ్యాచ్ ఇంకేముంటుంది.. ఓవల్ వేదికగా బుధవారం నుంచి ఆరంభం కానున్న భారత్ (Team India), ఆస్ట్రేలియా (Australia) WTC ఫైనల్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెస్ట్ ఫార్మాట్‌లో వరల్డ్‌ కప్‌గా పిలిచే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను 2019లో తీసుకొచ్చింది ఐసీసీ.. టీ ట్వంటీలతో ప్రమాదంలో పడినట్టు కనిపించిన సంప్రదాయ క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచే ఉధ్ధేశంతో దీనిని నిర్వహిస్తోంది. తొలి రెండేళ్ళ సీజన్‌లో దాదాపు అగ్రశ్రేణి జట్లన్నీ హోరాహోరీగా తలపడితే.. టీమిండియా, న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరాయి.

తుది పోరులో భారత్‌పై ఆధిపత్యం కనబరిచిన కివీస్ తొలి టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు మరోసారి WTC ఫైనల్‌ అభిమానులను అలరించబోతోంది. వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత్, టైటిల్ కోసం ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. ఓవల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో బలాబలాల పరంగా రెండు జట్లూ సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. రోహిత్ , కోహ్లీ, పుజారా, గిల్ వంటి స్టార్ బ్యాటర్లతో బలమైన టీమిండియా బ్యాటింగ్ లైనప్‌కు అద్భుతమైన ఆసీస్ పేస్ ఎటాక్ సవాల్ విసురుతోంది.

Also Read: Ajinkya Rahane: అజింక్యా రహానేను అందుకే జట్టులోకి తీసుకున్నాం: కోచ్ రాహుల్ ద్రవిడ్

టీమిండియా బ్యాటింగ్‌లో మరోసారి కోహ్లీ, పుజారాలపైనే అందరి చూపు ఉంది. ఆసీస్‌పై వీరిద్దరికీ అద్భుతమైన రికార్డుండడమే దీనికి కారణం. 2021-23 WTC సీజన్‌లో పుజారా, కోహ్లీనే భారత్ తరపున పరుగుల వరద పారించారు. దీంతో తుది పోరులోనూ మరోసారి వీరిపైనే అంచనాలున్నాయి. చాలారోజుల తర్వాత జట్టులోకి వచ్చిన రహానే, ఐపీఎల్‌లో అదరగొట్టిన గిల్‌ ఎలా ఆడతారనేది చూడాలి. అటు ఆసీస్ బ్యాటింగ్‌లో వార్నర్, ఖవాజా, స్మిత్, లబూషేన్ కీలకం కానున్నారు. కంగారూల టాపార్డర్‌ను పడగొడితే రోహిత్‌సేన విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. ఇక బౌలింగ్ పరంగా చూస్తే బూమ్రా లేకున్నా భారత్ పేస్ ఎటాక్ బలంగానే ఉంది. షమీ, సిరాజ్‌తో పాటు మరో ఇద్దరు పేసర్లుగా ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.

ఇక ఆసీస్ పేస్ ఎటాక్‌లో మిఛెల్ స్టార్క్, కమ్మిన్స్‌ ప్రధాన బలం. ఇదిలా ఉంటే మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఓవల్‌ పిచ్‌ ఆసీస్ పిచ్‌లకు కాస్త దగ్గరగా ఉండడం కంగారూలకు అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. అయితే ఓవల్‌లో భారత్ ఆసీస్ తలపడనుండడం ఇదే తొలిసారి. గత రికార్డులను చూస్తే ఇక్కడ 14 టెస్టులు ఆడిన టీమిండియా రెండింటిలోనే విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే ఇరు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.